జహీరాబాద్‌లో కాల్పుల కలకలం

16 Nov, 2020 18:51 IST|Sakshi

సాక్షి, మెదక్‌: జిల్లాలో కాల్పుల కలకలం రేగింది. భూ వివాదం విషయంలో చోటు చేసుకున్న ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపై కాల్పులకు పాల్పడ్డారు. కత్తులతో దాడి చేసుకున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలయ్యాయి. ఉమ్మడి మెదక్‌ జిల్లా సంగారెడ్డి పరిధిలోని జహీరాబాద్ మండలంలోని గోవిందపూర్ గ్రామ శివారులో ఈ ఘటన చోటు చేసుకుంది. దాదాపు 10 కోట్ల రూపాయల విలువైన సుమారు 30 ఎకరాల భూ వివాదంలో ఇరు వర్గాల మధ్య ఈ ఘర్షణ చెలరేగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జహీరాబాద్‌కు చెందిన కమల్‌ కిశోర్‌ పల్లాడ్‌ గోవిందపూర్‌ శివారులోని జీడిగడ్డతాండ గ్రామంలోని 104 , 105 సర్వే నెంబర్లలోని 31 ఎకరాల భూమిలో 15 మంది కూలీలతో కడీలు వేయిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న జహీరాబాద్‌కు చెందిన అలీ అక్బర్‌, అస్రద్‌లు జీడిగడ్డతాండకు వెళ్లారు. సర్వే నంబర్‌ 109లో అలీ అక్బర్‌ భూమి ఉంది. అయితే కమల్‌ కిశోర్‌ పల్లాడ్‌ కడీలు వేయించే భూమిలో కూడా తమ ల్యాండ్‌ ఉందంటూ అలీ అక్బర్‌ వర్గం గొడవకు దిగింది. దాంతో ఇరు వర్గాల మధ్య వివాదం పెరిగింది. (చదవండి: వివాదం ఉందంటే అక్కడ వీరి కన్ను పడుద్ది!)

ఈ నేపథ్యంలో అలీ అక్బర్‌ జహీరాబాద్‌కు చెందిన లాయక్‌ అనే రౌడీ షీటర్‌కు ఫోన్‌ చేసి పిలిపించాడు. స్కార్పియో వాహనంలో ఆయుధాలతో జీడిగడ్డతాండకు చేరుకున్న లాయక్‌.. కర్రలు, కత్తులతో కమల్‌ కిశోర్‌ వర్గంపై దాడి చేశాడు. తుపాకీతో గాల్లోకి ఆరు రౌండ్లు కాల్పులు జరిపాడు. భయభ్రాంతులకు గురైన ప్రజలు అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనలో ఒక్కరికి గాయాలు అయ్యాయి. ఇక కమల్‌ కిశోర్‌ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి.. అలీఅక్బర్‌, అస్రద్‌లను అదుపులోకి తీసుకున్నారు. ఇక రౌడీ షీటర్‌ లాయక్‌ కోసం మూడు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు. లాయక్‌పై జహీరాబాద్‌ రూరల్‌ పీఎస్‌లో రౌడీషీట్‌ తెరిచారు. ఇక 2018లో జరిగిన ఓ హత్యకు సంబంధించి లాయక్‌పై కేసు నమోదు అయ్యిందని పోలీసులు తెలిపారు. అంతేకాక కమల్‌ కిషోర్‌, అక్బర్‌ అలీ మధ్య దాదాపు పదేళ్లుగా ఈ భూ వివాదం కొనసాగుతున్నట్లు పోలీసులు వెల్లడించారు. 

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా