కరీంనగర్‌లో కలకలం.. కాల్పులు జరిగాయా? ప్రచారమేనా?

17 Jul, 2021 11:33 IST|Sakshi
గాయాలు చూపిస్తున్న మున్నవర్‌, ఇన్‌సెట్లో నిందితుడు సయీద్‌ అజ్గర్‌

షట్టర్ల విషయంలో అన్నదమ్ముల మధ్య గొడవ

కాల్పులు జరిగాయంటూ ప్రచారం

అలాంటిదేమీ లేదని తేల్చిన     పోలీసులు 

పోలీసుల అదుపులో నిందితుడు

కరీంనగర్‌క్రైం: కరీంనగర్‌లో శుక్రవారం రాత్రి అన్నదమ్ముల మధ్య చోటుచేసుకున్న ఆస్తి వివాదం కలకలం రేపింది. ఇంటి స్థలం విషయంలో అన్నదమ్ముల మధ్య నెలకొన్న గొడవ ముదిరి పరస్పరం దాడి చేసుకునే వరకూ వెళ్లింది. ఈ క్రమంలో గన్‌తో కాల్పులు జరిగాయన్న వార్త స్థానికంగా చర్చనీయాంశమైంది. పోలీసులు, బాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. నగరంలోని ఖలీల్‌పురకు చెందిన మీర్‌గులామ్‌ అజార్‌కు ఐదుగురు కుమారులు, ఇద్దరు కూమార్తెలు.

సయీద్‌ అజ్గర్‌ హుస్సేన్‌ (52) పెద్దవాడు. అతని తమ్ముళ్లు సయీద్‌ శంషద్‌ హుస్సేన్, సయీద్‌ అల్తాఫ్‌ హుస్సేన్, సయీద్‌ అన్వర్‌ హుస్సేన్, సయీద్‌ మున్నవర్‌ హుస్సేన్‌లకు మధ్య ఇంటి షట్టర్ల విషయంలో గొడవలు జరుగుతున్నాయి. రెండు రోజుల కిత్రం కూడా గొడవ జరగడంతో అజ్గర్‌హుస్సేన్‌పై గురువారం అతని తమ్ముళ్లు వన్‌టౌన్‌ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. అయినా.. శుక్రవారం రాత్రి అన్నదమ్ములు మరోసారి గొడవ పడ్డారు. అయితే.. కాల్పులు జరిగినట్లుగా శబ్దం రావడంతో స్థానికులు హైరానా పడ్డారు.

వివరాలు తెలుసుకుంటున్న పోలీసులు

ఈ విషయాన్ని పోలీసులకు చేరవేశారు. దీంతో అడిషనల్‌ డీసీపీలు శ్రీనివాస్, అశోక్, వన్‌టౌన్‌ సీఐ నటేశ్‌ సంఘటనా స్థలానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. అజ్గర్‌ ఇన్నోవా కారు అద్దాలు పగిలి ఉండడంతో గన్‌తో కాల్పులు జరిపాడని పోలీసులు ముందుగా భావించారు. ఘటనా స్థలంలో గన్, బుల్లెట్ల కోసం వెతికారు. కానీ.. ఎక్కడా దొరకలేదు. దీంతో అజ్గర్‌ను, అతని కారును పోలీసులు స్టేషన్‌కు తరలించారు. పోలీసులు అక్కడ దొరికిన ఆధారాలను ఫోరెన్సిక్‌కు పంపించగా.. కాల్పులు జరగలేదని నిర్ధారించినట్లు సీపీ కమలాసన్‌రెడ్డి స్పష్టం చేశారు. అక్కడ లభించిన వీడియో ఫుటేజీల ఆధారంగా వారి మధ్య గొడవ మాత్రమే జరిగిందని తెలిపారు.  

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు