అబిడ్స్‌ ఎస్‌బీఐలో కాల్పుల కలకలం

14 Jul, 2021 15:59 IST|Sakshi

కాంట్రాక్ట్‌ ఉద్యోగిపై కాల్పులకు పాల్పడిన సెక్యూరిటీ గార్డు

సాక్షి, హైదరాబాద్‌: కూకట్‌పల్లి ఏటీఎం వద్ద దుండగులు కాల్పులకు పాల్పడిన ఘటన మరవక ముందే హైదరాబాద్‌లో మరో దారుణం చోటు చేసుకుంది. ఈ సారి ఏకంగా ఎస్‌బీఐ బ్యాంక్‌లో కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళతో పాటు ఎస్‌బీఐ కాంట్రాక్ట్‌ ఉద్యోగి ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి.

ఆ వివరాలు.. అబిడ్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని ఎస్‌బీఐ బ్యాంక్‌లో బుధవారం కాల్పులు చోటు చేసుకున్నాయి. కాంట్రాక్ట్‌ ఉద్యోగి సురేందర్‌పై సెక్యూరిటీ గార్డ్‌ సర్దార్‌ ఖాన్‌ కాల్పులు జరిపాడు. సెక్యూరిటీ వెపన్‌తో రెండు రౌండ్ల కాల్పులు జరిపాడు సర్దార్‌ ఖాన్‌. ఈ ఘటనలో సురేందర్‌ తీవ్రంగా గాయపడటమే కాక.. అక్కడే ఉన్న మహిళా కస్టమర్‌ కడుపులోకి బుల్లెట్‌ దూసుకెళ్లడంతో ఆమెకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.

సురేందర్‌, సెక్యూరిటీ గార్డు ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం కాస్త చినికి చినికి చివరకు కాల్పులు చోటు చేసుకునే వరకు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సురేందర్‌ను, మహిళను హైదర్‌గూడ అపోలో ఆస్పత్రికి తరలించారు. కాల్పులు జరిపిన సెక్యూరిటీ గార్డు సర్దార్‌ ఖాన్‌ను అబిడ్స్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వివాదానికి కారణం తెలియాల్సి ఉంది. 

కాల్పుల ఘటనపై అబిడ్స్‌ ఏసీసీ వెంకట్‌రెడ్డి మాట్లాడారు. ‘‘బ్యాంక్‌ ఉద్యోగి, సెక్యూరిటీగార్డుకు మధ్య మాటా మాటా పెరగడంతో కాల్పులకు దారితీసింది. ఆవేశంతో సెక్యూరిటీగార్డు తన గన్‌తో సురేందర్‌పై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో సురేందర్‌ కడుపులోకి రెండు బుల్లెట్లు దిగాయి.
సెక్యూరిటీగార్డు సర్దార్‌ఖాన్‌ను అదుపులోకి తీసుకున్నాం’’ అని వెంకట్‌రెడ్డి తెలిపారు.

మరిన్ని వార్తలు