కూకట్‌పల్లిలో కాల్పుల కలకలం..చంపేసి.. దోచేశారు

30 Apr, 2021 01:49 IST|Sakshi

 ఏటీఎంలో నగదు నింపే సిబ్బందిపై దుండగుల కాల్పులు..

అక్కడికక్కడే మృతి చెందిన ఓ సెక్యూరిటీ గార్డ్‌

కస్టోడియన్‌కు తీవ్ర గాయాలు, రూ.5 లక్షల దోపిడీ..

సంగారెడ్డి సమీపంలో నిందితుల అరెస్ట్‌?

సాక్షి, హైదరాబాద్‌/భాగ్యనగర్‌కాలనీ: అది కూకట్‌ పల్లిలోని విజయ్‌నగర్‌ కాలనీ... గురువారం మిట్ట మధ్యాహ్నం... అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న ఆ  ప్రాంతం కాల్పుల మోతతో దద్దరిల్లింది. ఏటీ ఎం మిషన్లలో నగదు నింపే రైటర్‌ సేఫ్‌ గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ఉద్యోగులు టార్గె ట్‌గా ఈ ఫైరింగ్‌ జరిగింది. ఈ కాల్పుల్లో ఓ సెక్యూరిటీగార్డు అక్కడికక్కడే చనిపోగా.. మరో కస్టోడియన్‌కు తీవ్ర గాయాల య్యాయి. రూ.11 లక్షలు దోచుకోవడానికి ప్రయత్నించిన దుండగుల చేతికి రూ.5 లక్షలు చిక్కాయి. నిందితులు రెక్కీ చేసిన తర్వాతే ద్విచక్ర వాహనంపై వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు అను మానిస్తున్నారు. రైటర్‌ సేఫ్‌గార్డ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌  సంస్థ ఏటీఎం కేంద్రాల్లో నగదు నింపే బాధ్యతల్ని నిర్వర్తిస్తోంది. హైదరా బాద్‌లో ఆయా ఏటీఎం కేంద్రాలు ఉన్న మార్గాలను రూట్లుగా విభజించి రోజూ కస్టోడియన్లతో డబ్బు పంపిస్తుంది.

ప్రతి వ్యాన్‌కు ఇద్దరు కస్టోడియన్లు, ఓ సెక్యూరిటీ గార్డ్‌ ఉంటారు. వీటిలో ఓ బృందం రోజూ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన ఏటీఎం మిషన్లలో నగదు నింపుతూ ఉంటుంది. ఆ సంస్థకు చెందిన వ్యాన్‌(ఏపీ36వై9150)లో డ్రైవర్‌ కృష్ణ, పటాన్‌చెరుకు చెందిన కస్టోడి యన్లు చింతల శ్రీనివాస్‌(33), ఎ.నవీన్‌ లతోపాటు సెక్యూరిటీగా విధులు నిర్వర్తి స్తున్న బోరబండ వాసి అయిన సీఆర్‌ పీఎఫ్‌ మాజీ కానిస్టేబుల్‌ మీర్జా సుభాన్‌ అలీ బేగ్‌ (74) నగదుతో బయలుదేరారు. ఆ సమయంలో సదరు వ్యాన్‌లో మొత్తం రూ.2.7 కోట్లు ఉన్నాయి.  బేగంపేట నుంచి బయలుదేరిన ఈ టీమ్‌ కూకట్‌పల్లిలోని ఏటీఎం మిషన్లలో రూ.12 లక్షలు నింపింది. అక్కడి నుంచి మధ్యాహ్నం 1.40 గంటల ప్రాంతంలో కూకట్‌పల్లిలోని విజయ్‌నగర్‌కాలనీకి చేరుకుంది. అక్కడ ఉన్న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు ఏటీఎంలో రూ.11 లక్షలు నింపేందుకు వచ్చారు. డ్రైవర్‌ కృష్ణ వాహనంలోనే ఉండగా, ఇద్దరు కస్టోడియన్లు, సెక్యూరిటీ గార్డు నగదు తీసుకుని ఏటీఎం కేంద్రం వద్దకు వెళ్లారు. మిగిలిన మొత్తం వ్యాన్‌లోనే ఉంది.

సెక్యూరిటీ గార్డు అలీబేగ్‌ తన తుపాకీతో బయటే వేచి ఉండగా,  మిగిలిన ఇద్దరూ లోపలకు వెళ్లి నగదు నింపడానికి ఉపక్రమించారు. ఆ సమయంలో ఇద్దరు యువకులు నల్ల రంగు పల్సర్‌ వాహనంపై జగద్గిరిగుట్ట వైపు నుంచి దూసుకువచ్చారు. వీరి వయస్సు 25 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుందని, వాహనాన్ని నడుపుతున్న వ్యక్తి హెల్మెట్‌ ధరించాడని ప్రత్యక్ష సాక్షులు పేర్కొన్నారు. ఏటీఎం కేంద్రం వద్ద ద్విచక్ర వాహనం ఆగడంతోనే వెనుక కూర్చున్న వ్యక్తి కిందికి దిగి మీర్జాపై నాటు పిస్టల్‌తో ఓ రౌండ్‌ కాల్పులు జరిపాడు. తూటా ఎడమ వైపు గుండె కింది భాగంలో కడుపులోకి దూసుకుపోవడంతో ఆయన అక్కడిక్కడే కుప్పకూలి చనిపోయారు. లోపలకు వెళ్లిన దుండగులు మరో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. వీటిలో ఒక తూటా శ్రీనివాస్‌ మోకాలులోంచి దూసుకుపోగా, మరోటి అక్కడే ఉన్న అద్దానికి తగిలింది.

అదే సమయంలో అక్కడ ఉన్న రూ.5 లక్షలను చేజిక్కించుకున్న ఇరువురూ క్షణాల్లో ఉడాయించారు. వీరిని పట్టుకునేందుకు నవీన్, కృష్ణ ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. స్థానికులు అప్రమత్తమై దుండగులపై రాళ్లు విసిరినా తప్పించుకుని కేపీహెచ్‌బీ కాలనీ వైపు పారిపోయారు.  వారి తుపాకీకి సంబంధించిన మ్యాగజీన్‌ అక్కడే పడిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు రెండు తూటాలకు సంబంధించిన ఖాళీ క్యాట్రిడ్జ్‌లు, నిందితులు వదిలి వెళ్లిన హెల్మెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. మూడో తూటాకు సంబంధించినది అక్కడ లభించలేదు. 

పక్క ప్లాన్‌ ప్రకారమే...
క్లూస్‌ టీమ్, డాగ్‌స్క్వాడ్‌లు ఘటనాస్థలానికి చేరుకొని, నిందితులకు చెందినవిగా అనుమానిస్తున్న వేలిముద్రలను సేకరించాయి. ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫుటేజీని పరిశీలించి అనుమానితుల ఫొటోలు సేకరించారు. ఘటనాస్థలాన్ని సైబరాబాద్‌ సీపీ సజ్జనార్‌ పరిశీలించారు. ఈ నిందితులు గతంలోనూ ఇలాంటి నేరాలకు పాల్పడినట్లుగా అనుమానిస్తున్నామన్నారు. ఈ వాహనం కదలికలపై రెక్కీ చేసిన తర్వాతే, గురువారం దాన్ని వెంబడిస్తూ వచ్చి దాడి చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బేగంపేట నుంచి ఘటనాస్థలి వరకు ఉన్న సీసీ కెమెరాల్లో గత 15 రోజులుగా రికార్డు అయిన ఫుటేజ్‌ని పరిశీలిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లోని ఫోన్‌ లొకేషన్స్‌ను సాంకేతికంగా ఆరా తీస్తున్నారు.


బీహార్‌ లేదా రాజస్థాన్‌ ముఠాలపై అనుమానం...
 ఇది బీహార్‌ లేదా రాజస్థాన్‌కు చెందిన ముఠా పని అయి ఉంటుందని అనుమానిస్తున్నారు. వీరిద్దరితోపాటు ఈ ముఠాకు చెందినవారు మరికొందరు ఉండి ఉంటారని, నేరం చేసిన తర్వాత వాళ్లు పరారై ఉంటారని భావిస్తున్నారు. కేపీహెచ్‌బీ కాలనీ వైపు వెళ్లిన దుండగులు మళ్లీ కూకట్‌పల్లి ప్రధాన రహదారి ఎక్కలేదని అధికారులు అనుమానిస్తున్నారు. వివిధ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను పరిశీలించినా వారి కదలికలు కనిపించపోవడం గమనార్హం.  అయితే దుండగులు తమ వాహనం వదిలేసిగానీ, దుస్తులు మార్చుకుని గానీ ఉంటారనే అంశాన్నీ కొట్టి పారేయలేమని చెప్తూ ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. సీసీ కెమెరాల నుంచి సేకరించిన అనుమానితుల ఫొటోలను బీహార్, రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరప్రదేశ్‌ పోలీసులకు పంపారు. రంగంలోకి దిగిన పది ప్రత్యేక బృందాలు ముమ్మరంగా గాలింపు చేపట్టాయి. చికిత్స పొందుతున్న శ్రీనివాస్‌ పరిస్థితి స్థిరంగా ఉందని వైద్యులు చెప్పారు.
    


 

చదవండి: ఆల్కహాల్‌ తీసుకుంటే కరోనా రాదా.. నిజమెంత? 
వాడిని చంపేయండి.. వదలొద్దు!

మరిన్ని వార్తలు