బాలుడి కిడ్నాప్‌ కలకలం

17 Nov, 2020 21:00 IST|Sakshi

గంటల వ్యవధిలో  ఆచూకీ గుర్తించిన పోలీసులు 

తల్లిదండ్రులకు అప్పగింత

సాక్షి, గుంటూరు/సత్తెనపల్లి: సత్తెనపల్లి పట్టణంలో ఆరో తరగతి చదువుతున్న బాలుడి కిడ్నాప్‌ ఘటన మంగళవారం కలకలం సృష్టించింది. నిర్మాలా నగర్‌ రైల్వే గేట్‌ వద్ద నివాసం ఉంటున్న తుమ్మా వెంకటేశ్వర్లు, లీలావతి దంపతులకు వినయ్‌కుమార్, దేవిప్రియ సంతానం. వెంకటేశ్వర్లు వస్త్ర వ్యాపారం చేస్తుంటారు. సోమవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో వినయ్‌ ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. ఎంతసేపటికీ తిరిగి రాకపోవడంతో తల్లిదండ్రులు చుట్టుపక్కల వెతికారు. 10 గంటల ప్రాంతంలో “మేము మీ కుమారుడిని కిడ్నాప్‌ చేశాం’ అంటూ వినయ్‌ తాత సాంబశివరావు సెల్‌ నంబర్‌ నుంచి వెంకటేశ్వర్లుకు ఫోన్‌ వచ్చింది.

“మేము నీ కుమారున్ని కిడ్నాప్‌ చేశాం. పోలీసులకు సమాచారం ఇస్తే వాడిని ముక్కలుగా నరికి అవయవాలు ఇంటికి పంపుతాం. మేం చెప్పినట్టు నువ్వు చెయ్‌. రూ.60 లక్షలు ఇస్తే నీ కుమారుడిని వదిలేస్తాం. లేదంటే ముక్కలుగా నరికి అవయవాలు ఒక్కొక్కటిగా మీ ఇంటికి పంపుతాం’ అంటూ విజయవాడ పటమటకు చెందిన మున్నా గ్యాంగ్‌ పేరుతో బెదిరించారు. దీంతో భయాందోళనకు గురైన వెంకటేశ్వర్లు అర్ధరాత్రి 12 గంటల సమయంలో సత్తెనపల్లి పట్టణ పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి తమ కుమారుడు కనిపించడంలేదని, కిడ్నాప్‌ చేశామంటూ గుర్తు తెలియని వ్యక్తులు ఫోన్‌ చేసి బెదిరిస్తున్నారని పోలీసులకు చెప్పారు.

తన తండ్రి సాంబశివరావు ఫోన్‌లోని సిమ్‌ను సోమవారం వినయ్‌ అడిగి తీసుకున్నాడని, ఆ సిమ్‌కు చెందిన నంబరు నుంచి బెదిరింపు కాల్స్‌ వచ్చాయని వివరించారు. ఇది కిడ్నాపా? లేక బెదిరించడం కోసం ఎవరైనా ఈ పనిచేస్తున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సెల్‌ టవర్‌ లొకేషన్‌ పరిశీలించగా సత్తెనపల్లి పట్టణంలోని సంగం బజార్‌ ప్రాంతంలో చూపించింది. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు రెక్కీ చేపట్టారు. మంగళవారం ఉదయం సత్తెనపల్లి పట్టణంలోకి వచ్చి, పోయే ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేశారు.  

రూ.60 లక్షలతో ప్రారంభించి.. రూ.10 వేలకు   
తొలుత బాలున్ని వదిలిపెట్టడానికి రూ.60 లక్షలు డిమాండ్‌ చేసిన అవతలి వ్యక్తులు, వెంకటేశ్వర్లు తన వద్ద అంత సొమ్ము లేదని చెప్పడంతో రూ.10 లక్షలు, రూ.2 లక్షలు, రూ.50 వేలు ఇస్తే వదిలేస్తామని బేరమాడుతూ వచ్చారు. చివరికి రూ.10 వేలు తీసుకొచ్చి సత్తెనపల్లి పట్టణంలోని నరసరావుపేట రోడ్డులోని వెంకటపతి కాలనీ దగ్గరకు వచ్చి అక్కడున్న ఓ కారు వద్ద డబ్బు పెడితే బాలుడిని వదిలేస్తామని ఒప్పందం చేసుకున్నారు. దీంతో వెంకటేశ్వర్లు మంగళవారం మధ్యాహ్నం గుర్తుతెలియని వ్యక్తులు చెప్పిన చోటకు వచ్చి కారుపై డబ్బు ఉంచి దూరంగా వేచి ఉన్నారు.

సుమారు ఐదు గంటల సమయంలో పక్కనే ఉన్న నిర్మానుష్య ప్రదేశంలోని చెట్ల పొదల్లోంచి బాలుడిని తీసుకు వచ్చి రోడ్డుపై వదిలేసి పక్కనున్న వ్యక్తి పారిపోయాడు. బాలుడిని పోలీసులు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. అనంతరం డీఎస్పీ విజయభాస్కర్‌రెడ్డి, సీఐ విజయచంద్ర ఆ బాలుడి నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు. 

బాలుడి మాటలు ఇలా.. 
తన స్నేహితుడితో కలిసి నడిచి వెళ్తుంటే గుర్తు తెలియని వ్యక్తులు తనను బలవంతంగా కారులో ఎక్కించుకుని వెళ్లారని బాలుడు తుమ్మా వినయ్‌ పోలీసులు విచారణలో తొలుత తెలిపాడు. ఈ నేపథ్యంలో వినయ్‌ చెప్పిన బాలుడిని విచారణలో భాగంగా పిలిపించగా అతను సోమవారం సత్తెనపల్లి పట్టణంలోనే లేడని తేలింది. దీంతో బాలుడు వినయ్, తల్లిదండ్రులను విడివిడిగా పోలీసులు విచారిస్తున్నారు. సైకిల్, టీవీఎస్‌ మోపెడ్‌ కొనిపెట్టాలని తరచూ ఇంటిలో మారం చేస్తుండేవాడని పోలీస్‌ విచారణలో తెలిసిందని సమాచారం.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు తన కోర్కెలు తీర్చడం లేదని తన స్నేహితులతో కలిసి బాలుడే కిడ్నాప్‌ డ్రామా ఆడాడా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరా ఫుటేజ్‌లు, వినయ్‌ తాత సిమ్‌ కాల్‌ డేటా సేకరించి వివిధ కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాలుడి ఆచూకీ కోసం సోమవారం అర్ధరాత్రి నుంచి ఏడు బృందాలు నిర్విరామంగా కృషి చేశాయని సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కర్‌ రెడ్డి తెలిపారు. ఐదుగురు పాత నేరస్తులను అదుపులోకి విచారించామన్నారు. గంటల వ్యవధిలోనే బాలుడి కేసును ఛేదించామన్నారు. ఏం జరిగింది? ఎవరు బాలున్ని కిడ్నాప్‌ చేశారు? అనే వివరాలు ఇంకా తెలియలేదు, విచారణ కొనసాగుతోందన్నారు.

మరిన్ని వార్తలు