అండర్‌గ్రౌండ్‌లో పేకాట శిబిరంపై దాడి

30 Jul, 2020 12:09 IST|Sakshi

గుంటూరు ఈస్ట్‌ : అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా నిర్వహిస్తున్న పేకాట స్థావరాన్ని అరండల్‌పేట పోలీసులు ఛేదించారు. అమరావతి మెయిన్‌రోడ్డులోని ఓ లాడ్జిలో రెండో అంతస్థులోని బాత్‌రూము పక్కన గోడకు రధ్రం పెట్టి సెల్లార్లోకి మెట్లు ఏర్పాటు చేసుకుని బయటి వ్యక్తులు ఎవరు లోపలికి వచ్చినా కనిపెట్టలేని విధంగా జూద గృహం నిర్వహిస్తుండడాన్ని పోలీసులు చాకచక్యంగా గుర్తించారు. పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ రవీంద్ర తెలిపిన వివరాల ప్రకారం..అమరావతి రోడ్డు మెయిన్‌రోడ్డులోని డీలక్స్‌ లాడ్జిలో అండర్‌గ్రౌండ్‌లో రహస్యంగా పేకాట నిర్వహిస్తున్నారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో కస్టమర్లు ఎవరూ లేకపోయినా పలువురు లాడ్జిలోకి వెళ్లి రావడం చుట్టుపక్కల వారికి అనుమానం కలిగించింది.

స్థానికులు పోలీసు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. అర్బన్‌ ఎస్పీ అమ్మిరెడ్డి సీరియస్‌గా తీసుకుని పలువురు సీఐలను బృందగా ఏర్పాటు చేసి బుధవారం దాడి చేయించారు. లోపలకు వెళ్లిన పోలీసులకు పేకాట  ఎక్కడ ఆడుతుంది తెలియలేదు. ఉన్నతాధికారులకు పేకాట నిర్వహణ సమాచారం పక్కాగా ఉండడంతో ఘటనా స్థలానికి వెళ్లిన పోలీసులు లాడ్జిలోని వ్యక్తులను తమదైన శైలిలో విచారించారు. దీంతో సిబ్బంది అండర్‌గ్రౌండ్‌కు ఏర్పాటు చేసిన రహస్య ద్వారం చూపించారు. రెండో ఫ్లోర్‌లో బాత్‌రూము పక్కన చిన్న సందు పెట్టి అండర్‌గ్రౌండ్‌లో కింద హాలు ఏర్పాటు చేశారు. అండర్‌గ్రౌండ్‌లో 16 మంది పేకాట ఆడుతుండగా పోలీసులు దాడి చేశారు. కొందరు పారిపోయే ప్రయత్నం చేశారు. ముఖ్య నిర్వాహకుడు ముదనం పేరయ్య ముందుగానే పరారయ్యాడు. మిగిలిన 16 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తరలించారు. వీరిలో లాడ్జి యజమాని ఉండటం గమనార్హం. వారి వద్ద నుంచి పోలీసులు రూ.1.32 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.  

మరిన్ని వార్తలు