అది చంద్రబాబు ఇంటిపై దాడి కాదు

21 Sep, 2021 05:11 IST|Sakshi

డీజీపీ కార్యాలయం వద్ద అల్లర్లు, ఆందోళనలు చేయడం సరికాదు

గుంటూరు రేంజ్‌ డీఐజీ త్రివిక్రమవర్మ

నగరంపాలెం (గుంటూరు వెస్ట్‌): మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటిపై దాడి జరిగినట్టు గత శుక్రవారం కొన్ని మీడియా చానళ్లు కథనాలు ప్రసారం చేశాయని.. నిజానికి ఆ ఘటన జరిగింది ప్రజలు రాకపోకలు చేసే కరకట్టపై అని గుం టూరు రేంజ్‌ డీఐజీ డాక్టర్‌ సీఎం త్రివిక్రమవర్మ స్పష్టం చేశారు. తన కార్యాలయంలో అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్, రూరల్‌ ఎస్పీ విశాల్‌ గున్ని, ఏఎస్పీ చక్రవర్తితో కలిసి డీఐజీ సోమవారం  మీడియాతో మాట్లాడారు. ఆ రోజు పెడన ఎమ్మెల్యే జోగి రమేష్‌ కరకట్ట ప్రాంతానికి వెళ్లారని.. ఆ ప్రాంతానికి, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంటికి 300 నుంచి 350 మీటర్ల దూరం ఉందని చెప్పారు. ఇంత దూరంలో ఉండగా, చంద్రబాబు ఇంటిపై దాడి జరిగిందని ఎలా ప్రసారం చేస్తారని ప్రశ్నించారు.

ఆ రోజు పెడన ఎమ్మెల్యే, ఆయన అనుచరుల వాహనాలపై దాడి జరిగిందని డీఐజీ చెప్పారు. ఎమ్మెల్యే కారు నుంచి కిందకు దిగారనే తప్పుడు కథనాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం సబబు కాదని అన్నారు. ఎమ్మెల్యే ప్రయాణిస్తున్న కారును పగులకొట్టడం, చెప్పుతో కొట్టడంతోపాటు డ్రైవర్‌ను కూడా చెప్పుతో కొట్టేందుకు టీడీపీ వారు ప్రయత్నించారని చెప్పారు. మరో వాహనాన్ని బండ రాయితో వెనుక అద్దం పగులకొట్టడం ఎం తవరకు సమంజసమని అన్నారు. వీటన్నింటిపైనా కేసులు నమోదు చేశామని తెలిపారు.

ఆ రోజు కరకట్టపై జరిగిన ఘటనకు సంబంధించిన వీడియో దృశ్యాలను ల్యాప్‌టాప్‌ ద్వారా డీఐజీ మీ డియాకు చూపించారు. అదే రోజు సాయంత్రం డీజీపీ ప్రధాన కార్యాలయానికి గుంపుగా వెళ్లి గం దరగోళం చేయడం అవసరమా అని ప్రశ్నించారు. డీజీపీకి వినతిపత్రం ఇచ్చేందుకు 75 మంది వెళ్తారా, అంతమందితో వచ్చి ఎలా ఫిర్యాదు చేస్తారని పేర్కొన్నారు. గతంలో అనేక ఘటనలపై ఎన్నో పార్టీలు ఫిర్యాదులు చేసేందుకు వచ్చాయని, కానీ గేట్‌ దాటుకుని గందరగోళం స్పష్టించ లేదని అన్నారు. వినతిపత్రం ఎవరైనా ఇవ్వవచ్చని, అయితే అలా వెళ్లడం పద్ధతి  కాదని అల్లర్లు, గందరగోళం స్పష్టించడం సరికాదని స్పష్టం చేశారు. 

► అర్బన్‌ ఎస్పీ ఆరిఫ్‌హఫీజ్‌ మాట్లాడుతూ గత శుక్రవారం కరకట్టపై ఉన్న వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకున్నామని తెలిపారు. రూరల్‌ ఎస్పీ విశాల్‌గున్ని మాట్లాడుతూ.. పోలీసులు డ్యూటీ వదిలేసి స్పష్టతలు ఇవ్వడమే డ్యూటీగా ఉందని అసహనాన్ని వ్యక్తం చేశారు. ఏవైనా ప్రసారం చేసేప్పుడు ఒకసారి నిజ నిర్ధారణ చేసుకోవాలని కోరారు. 

మరిన్ని వార్తలు