పనిపిల్లపై యజమాని కుటుంబం దాష్టీకం

11 Dec, 2023 05:43 IST|Sakshi

13 ఏళ్ల టీనేజర్‌ను వివస్త్రను చేసి బంధించిన వైనం

గురుగ్రామ్‌: పదమూడేళ్ల పనిపిల్ల పట్ల ఓ ఇంటావిడ దారుణంగా ప్రవర్తించింది. హరియాణాలోని గురుగ్రామ్‌ పట్టణంలోని సెక్టార్‌ 51 పరిధిలో ఈ ఘటన చోటుచేసుకుంది. పనికి కుదిర్చిన వ్యక్తితో కలిసి ఎట్టకేలకు తల్లి.. ఆమె కూతురుని విడిపించుకుంది. తాను అనుభవించిన చిత్రహింసను కూతురు ఏడుస్తూ చెప్పడంతో తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. పోలీసులకు అందిన ఫిర్యాదు ప్రకారం.. బిహార్‌కు చెందిన ఈమె తన కూతురును జూన్‌ 27వ తేదీన ఒకావిడ ఇంట్లో పనికి కుదిర్చింది.

ఇంట్లో ఉంచుకుని, పనికి నెలకు రూ.9,000 జీతం ఇచ్చేలా ఒప్పందం కుదర్చుకుంది. ‘‘ మొదట్లో రెండు నెలలు మాత్రమే నా కుతురుకు జీతం ఇచ్చారు. ఆ తర్వాత చిల్లిగవ్వ ఇవ్వలేదు. ఇంటి పని అంతా చేయించుకుని ఇష్టమొచి్చనట్ట కొట్టేవారు. పెంపుడు కుక్కతో కరిపించేవారు. యజమాని ఇద్దరు కుమారులు నా బిడ్డను లైంగికంగా వేధించారు. బలవంతంగా బట్టలూడదీసి ఫొటోలు, వీడియోలు తీసేవారు.

అసభ్యంగా తాకేవారు. యజమానురాలు ఇనుప కడ్డీ, సుత్తితో కొట్టి చిత్రహింసలు పెట్టేది. బయటకు తప్పించుకునిపోకుండా గదిలో బంధించేవారు. కట్టేసి అరవకుండా నోటికి టేప్‌ అంటించారు. చేతులపై యాసిడ్‌ పోశారు. విషయం బయటకు పొక్కితే చంపేస్తామని బెదిరించేవారు. నా బిడ్డకు రెండు రోజులకు ఒకసారి భోజనం పెట్టేవారు. ఇంతటి దారుణాలు తెలిశాక స్థానిక వ్యక్తితో కలిసి ఎట్టకేలకు ఆ బిడ్డను విడిపించుకున్నా’’ అని టీనేజర్‌ తల్లి వాపోయారు.

>
మరిన్ని వార్తలు