పేకాట కేసు: ముగిసిన సుమన్‌ కస్టడీ: వెలుగులోకి కీలక విషయాలు

5 Nov, 2021 11:30 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంచిరేవుల పేకాట కేసులో ఏ-1 నిందితుడిగా ఉన్న గుత్తా సుమన్ చౌదరి పోలీస్‌ కస్టడీ ముగిసింది. రెండు రోజులపాటు సుమన్‌ను విచారించిన పోలీసులు నేడు కోర్టులో హాజరు పర్చనున్నారు. కాగా పోలీసుల విచారణంలో కీలక అంశాలు వెలుగుచూశాయి. సుమన్‌పై క్యాసినో, పేకాట ఇతర కేసుల వివరాలపై పోలీసులు ఆరా తీశారు.. చాలా కాలంగా సుమన్‌ క్యాసినో, పేకాట నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. 

ఏపీ, తెలంగాణలో సుమన్ చౌదరిపై పలు కేసులు నమోదైనట్లు, ఎంట్రీ ఫీజు, కమీషన్‌ల రూపంలో లక్షల రూపాల వసూళ్లు చేసినట్లు తేలింది. సుమన్‌కు రాజకీయ నేతలు, రియల్టర్స్‌తో పెద్ద ఎత్తున పరిచయాలు ఉన్నట్లు గుర్తించారు. నగరంలోని శివారు ప్రాంతాల్లోని విల్లాలు, ఫామ్‌హౌజ్‌లు, హోటల్స్, రిసార్ట్స్ వేదికగా ఈ కార్యకలాపాలు నిర్వహించినట్లు తేలింది. క్రికెట్ బెట్టింగ్‌కు సైతం పలువురు నిందితులు పాల్పడినట్టు గుర్తించారు. అయితే డ్రగ్స్ కోణంలో సైతం పోలీసులు విచారించారు. మరోసారి కూడా సుమన్ చౌదరిని పోలీస్ కస్టడికి కోరే అవకాశం ఉంది.
చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట

కాగా గుంటూరు జిల్లాకు చెందిన గుత్తా సుమన్‌కుమార్‌ చౌదరి ఓ టీవీ చానల్‌లో డైరెక్టర్‌గా, రియల్టర్‌గా అవతారం ఎత్తాడు. సినిమాల్లో పెట్టుబడులు పెడుతుండటంతోపాటు పేకాట శిబిరాలు నిర్వహిస్తుంటాడు. పేకాటరాయుళ్లను గ్రూపులుగా చేసి హైదరాబాద్‌ శివార్లలోని మంచిరేవులకు రప్పించాడు. సినీహీరో నాగశౌర్య తండ్రి వాసవి రవీంద్రప్రసాద్‌ లీజుకు తీసుకున్న ఫాంహౌస్‌లో పెద్దఎత్తున పేకాట శిబిరాన్ని ప్రారంభించాడు. అది ఎస్‌ఓటీ పోలీసులకు తెలియటంతో ఆదివారం రాత్రి దాడులు చేసి అరెస్టు చేశారు.

మరిన్ని వార్తలు