చైనాకు  తెలుగు రాష్టాల నుంచి వెంట్రుకల స్మగ్లింగ్‌!

26 Aug, 2021 00:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

 హైదరాబాద్, తూ.గో. నుంచి అక్రమంగా తరలింపు

8 చోట్ల ఈడీ సోదాలు... రూ. 2.9 కోట్ల నగదు జప్తు

హవాలా ద్వారా చెల్లింపులు జరుగుతున్నట్లు గుర్తింపు

హైదరాబాద్‌లో మయన్మార్‌ పౌరుల దందా

సాక్షి, హైదరాబాద్‌: చైనా సహా పలు దేశాలకు ‘ఫెమా’నిబంధనలను ఉల్లంఘించి తల వెంట్రుకలు ఎగుమతి చేస్తున్న తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు వ్యాపారులపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కొరడా ఝళిపించింది. హైదరాబాద్, తూర్పు గోదావరి జిల్లాలో 8 చోట్ల ఆకస్మిక తనిఖీలు చేపట్టి ఆయా వ్యాపారులు లెక్కల్లో చూపని రూ. 2.90 కోట్ల నగదును జప్తు చేసింది. అలాగే వారి నుంచి 12 సెల్‌ఫోన్లు, మూడు లాప్‌టాప్‌లు, ఒక కంప్యూటర్, కొన్ని డైరీలను స్వాధీనం చేసుకుంది. ఈ మేరకు ఈడీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. 

చైనా యాప్స్‌పై దర్యాప్తులో కదిలిన డొంక..
చైనాకు చెందిన పలు ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ యాప్స్‌పై నమోదైన ఓ మనీలాండరింగ్‌ కేసును దర్యాప్తు చేస్తున్న క్రమంలో తెలంగాణ, ఏపీకి చెందిన తల వెంట్రుకల ఎగుమతిదారులకు రూ. 16 కోట్ల మేర హవాలా చెల్లింపులు జరిగినట్లు గుర్తించామని ఈడీ తెలిపింది. ఇందుకు సంబంధించి వారిపై ‘ఫెమా’నిబంధనల కింద దర్యాప్తు చేపట్టగా అక్రమ చైనీస్‌ యాప్‌ను ఉపయోగించి హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు వ్యాపారస్తులు ఈశాన్య ప్రాంతానికి చెందిన వ్యాపారస్తులకు తల వెంట్రుకలు విక్రయించి పేటీఎం ద్వారా రూ. 3.38 కోట్లు ఆర్జించినట్టు గుర్తించామని ఈడీ వివరించింది.

ఈ వ్యవహారంలో కొందరు మయన్మార్‌ జాతీయుల ప్రమేయాన్ని గుర్తించినట్లు తెలిపింది. హైదరాబాద్‌లో తిష్ట వేసిన పలువురు మయన్మార్‌ జాతీయలు భారతీయులు/భారతీయ సంస్థల కోసం ఉద్దేశించిన ఇంపోర్ట్‌–ఎక్స్‌పోర్ట్‌ కోడ్‌ను వాడి తల వెంట్రుకల విలువను తక్కువగా చూపి వారి దేశానికి ఎగుమతి చేస్తున్నట్లు తేలిందని ఈడీ వివరించింది. మయన్మార్, బంగ్లాదేశ్, వియత్నాం, ఆస్ట్రియా తదితర దేశాలకు తక్కువ పరిమాణంలో వెంట్రుకలను చూపి ఎక్కువ పరిమాణంలో వాటిని విక్రయించినట్లు ప్రాథమిక పరిశీలనలో తేలినట్టు ఈడీ వెల్లడించింది. కొందరు వ్యాపారస్తులు తమ ఉద్యోగుల బ్యాంకు ఖాతాల్లో విక్రయాల డబ్బులు పొందుతున్నట్లు ఈడీ గుర్తించింది. ఈ వ్యహారంపై సమగ్ర దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది.  

చైనా వయా మయన్మార్‌.. 
హైదరాబాద్, కోల్‌కతా, గువాహటికి చెందిన చాలా మంది వ్యాపారస్తులు విదేశీ వ్యాపారులకు వెంట్రుకలను ఎగుమతి చేస్తున్నట్టు ఈడీ దర్యాప్తులో వెల్లడైంది. మోరెహ్‌ (మణిపూర్‌), జొఖాతర్‌ (మిజోరం), ఐజ్వాల్‌ (మిజోరం) గుండా మండాలె (మయన్మార్‌)కు, అక్కడి నుంచి చైనాకు వెంట్రుకలను స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు ఈడీ గుర్తించింది. భారత్‌ నుంచి స్మగ్లింగ్‌ చేసిన వెంట్రుకలను చైనీస్‌ వెంట్రుకలుగా అక్కడి వ్యాపారస్తులు పేర్కొని దిగుమతి సమయంలో 28 శాతం సుంకాన్ని ఎగ్గొట్టడంతోపాటు ఎగుమతి సమయంలో 8 శాతం రాయితీలను పొందుతున్నారు. చాలా మంది భారత వ్యాపారవేత్తలు సైతం వెంట్రుకల ఎగుమతి సమయంలో వాటి పరిమాణాన్ని తగ్గించి చూపి ఎగుమతి సుంకాన్ని ఎగ్గొట్టుతున్నట్టు ఈడీ గుర్తించింది. 

మరిన్ని వార్తలు