పెళ్లయిన తొమ్మిది నెలలకే నూరేళ్లు నిండాయి

8 Apr, 2021 08:29 IST|Sakshi
శైలజ (ఫైల్‌) నిందితుడు నవీన్‌ 

సాక్షి, బంజారాహిల్స్‌: వివాహమైన తొమ్మిది నెలలకే ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. అత్తింటి వేధింపులు తాళలేక ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు, పోలీసుల కథనం ప్రకారం.. జీడిమెట్లకు చెందిన శైలజ (23)కు ఎస్పీఆర్‌హిల్స్‌ సమీపంలోని సంజయ్‌నగర్‌కు చెందిన డ్రైవర్‌ నవీన్‌తో తొమ్మిది నెలల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో ఒప్పందం ప్రకారం కట్న కానుకల కింద శైలజ తల్లిదండ్రులు 2 తులాల బంగారం, రూ.10 వేలు బాకీ పడ్డారు. ఈ నేపథ్యంలో పెళ్లైన  మరుసటి రోజు నుంచే శైలజకు వేధింపులు మొదలయ్యాయి. ఆమె అత్త తిరుపతమ్మ, భర్త నవీన్‌ శారీరకంగా, మానసికంగా హింసిస్తున్నారు. పలుమార్లు భర్త కొట్టడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది.

పెద్దల సమక్షంలో పంచాయితీ పెట్టి అత్తకు, భర్తకు నచ్చజెప్పి అత్తారింటికి పంపించారు. మూడు వారాలుగా ఆమెకు మళ్లీ వేధింపులు మొదలయ్యాయి. ప్రతిరోజూ కొట్టడం, దూషిస్తుండటంతో భరించలేని శైలజ మంగళవారం అర్ధరాత్రి తన గదిలో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదని అత్త, భర్తతో పాటు మరిది ప్రవీణ్‌ హత్య చేశారని, నిందితులను శిక్షించాలని మృతురాలి తండ్రి యాదగిరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. జూబ్లీహిల్స్‌ పోలీసులు శైలజ అత్త తిరుపతమ్మను, భర్త నవీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరిది ప్రవీణ్‌ పరారీలో ఉన్నట్లు చెప్పారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.  

చదవండి: ఖైరతాబాద్‌: ఆన్‌లైన్‌ క్లాసుల్లో అశ్లీల ఫోటోలు షేర్‌ చేస్తూ..
సెల్ఫీ వీడియో తీసుకుని యువకుడి ఆత్మహత్య 

మరిన్ని వార్తలు