హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో వేధింపులు.. హరికృష్ణ స్పందన ఇదే..

13 Aug, 2023 14:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలోని హకీంపేట్ స్పోర్ట్స్ స్కూల్‌లో లైంగిక వేధింపుల వ్యవహారం ప్రకంపనలు సృష్టిస్తోంది.  స్పోర్ట్స్ స్కూల్లో బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడుతున్న అధికారి బండారం బట్టబయలైంది. కాగా, లైంగిక వేధింపుల అధికారికి మంత్రి అండదండలు ఉన్నాయంటూ ప్రచారం జరుగుతోంది.

ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారి హరికృష్ణను సస్పెండ్‌ చేశామని, స్కూల్‌లో బాలికలపై లైంగిక వేధింపులపై ఉన్నతాధికారులతో పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ తెలిపారు. ఇక, విద్యార్థుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. 

మరోవైపు.. లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న హరికృష్ణ దీనిపై స్పందించారు. తాజాగా హరికృష్ణ మీడియాతో మాట్లాడుతూ..  ప్రాథమిక విచారణ చేసి నన్ను సస్పెండ్‌ చేశారు. ఇవి కేవలం ఆరోపణలు మాత్రమే. పూర్తి విచారణ తర్వాత నిజాలు బయటకు వస్తాయి అని కామెంట్స్‌ చేశారు. 

ఇదిలా ఉండగా.. ఈ లైంగిక వేధింపుల ఘటనపై ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించారు. బాలికలపై వేధింపుల ఘటనను ఎమ్మెల్సీ కవిత సీరియస్‌గా తీసుకున్నారు. దీనిపై స్పందిస్తూ.. తక్షణమే సదరు అధికారిపై చర్యలు చేపట్టాలని, విచారణ జరిపి బాధితురాళ్లకు న్యాయం జరిపించాలని క్రీడా మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ను ట్విట్టర్‌ వేదికగా కోరారు.

ఇది కూడా చదవండి: హెచ్‌ఎం వేధింపులు.. జాబ్‌ కావాలంటే , నేను చెప్పినట్లు వినాల్సిందే!

మరిన్ని వార్తలు