పాక్‌ నుంచి రిందా కుట్ర

6 May, 2022 05:10 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: పంజాబ్‌తోపాటు ఢిల్లీ, చండీగఢ్, మహారాష్ట్ర పోలీసులకు మోస్ట్‌ వాంటెడ్‌గా ఉన్న మాఫియా డాన్‌ హర్వీందర్‌ సింగ్‌ అలియాస్‌ రిందా పాకిస్తాన్‌ నుంచి భారత్‌లో పేలుళ్లకు కుట్ర పన్నాడు. పంజాబ్‌ కేంద్రంగా పనిచేస్తున్న నిషేధిత సంస్థ బబ్బార్‌ ఖల్సా ఇంటర్నేషనల్‌ (బీకేఐ) ముసుగులో అటు ఐఎస్‌ఐ, ఇటు ఉగ్రవాద సంస్థ లష్కరేతోయిబా (ఎల్‌ఈటీ)లకు సహకరిస్తున్నాడు.

దీనికోసం ఆయా రాష్ట్రాల్లో ఉన్న తన నెట్‌వర్క్‌ను వాడుకుంటున్నాడు. రిందా ఆదేశాల మేరకు పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌ నుంచి ఆదిలాబాద్‌కు మారణాయుధాలు, పేలుడు పదార్థమైన ఆర్డీఎక్స్‌ రవాణా చేస్తున్న నలుగురు ఉగ్రవాదులను హరి యాణాలోని కర్నాల్‌ వద్ద ఆ రాష్ట్ర పోలీసులు పట్టుకున్నారు. వీటి ట్రాన్సిట్‌ పాయింట్‌ ఆదిలాబాద్‌ అని, అక్కడకు వచ్చే నాందేడ్‌ ముఠా తీసుకుని వెళ్లేలా రిందా ప్లాన్‌ చేశాడని పోలీసులు గుర్తించారు.

త్రుటిలో తప్పించుకుని పాక్‌కు..
మహారాష్ట్రలోని నాందేడ్‌కు చెందిన రిందా కుటుంబం పంజాబ్‌లోని తరంతరాన్‌ జిల్లాకు వలసవెళ్లింది. 18 ఏళ్ల వయస్సులోనే సమీప బంధువును హత్య చేసిన రిందా.. తర్వాత నాందేడ్‌కు మకాం మార్చాడు. అక్కడా రెండు హత్యలతోసహా పలు నేరాలు చేసి పంజాబ్‌కు పారిపోయాడు. పంజాబ్‌ యూనివర్సిటీలో ఉన్న పరిచయస్తుల సాయంతో అందులోనే తలదాచుకున్నాడు. 2016లో అక్టోబర్‌లో ఆ వర్సిటీలో జరిగిన నిరసనల్లో పాల్గొన్న రిందా స్టూడెంట్‌ ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఓఐ) నాయకులపై తుపాకులతో కాల్పులు జరిపాడు. మాఫియా సంబంధాలతో హత్యలు, బలవంతపు వసూళ్లు తదితర నేరాలు చేయడంతో కేసులు నమోదయ్యాయి.

2017లో తన భార్యతో కలిసి బెంగళూరులోని ఓ హోటల్లో ఉన్నట్లు పంజాబ్‌ పోలీసులు గుర్తించారు. వీరి సమాచారంతో బెంగళూరు పోలీసులు ఆ హోటల్‌పై దాడి చేశారు. త్రుటిలో తప్పించుకున్న రిందా పాకిస్తాన్‌ పారిపోయాడు. అక్కడ ఉంటూనే బీకేఐతో సంబంధాలు ఏర్పాటు చేసుకున్నాడు.  బీకేఐ సంస్థ ఐఎస్‌ఐ, ఎల్‌ఈటీల కోసం పని చేస్తున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ బ్యూరో  గతంలోనే గుర్తించింది. తాజాగా రిందాను వినియోగించుకుని ఈ రెండు సంస్థలు భారత్‌లో భారీ విధ్వంసాలకు కుట్ర పన్నింది. దీనికోసం ఇతగాడు పంజాబ్‌లోని∙బీకేఐ స్లీపర్‌ సెల్స్‌తోపాటు నాందేడ్‌లో తన అనుచరులను వాడుకోవాలని పథకం వేశాడు.

మరిన్ని వార్తలు