పోలీస్​ స్టేషన్​లో ఆవు.. వెరైటీగా నిరసన..

7 Jun, 2021 14:14 IST|Sakshi

చండీఘడ్‌: సాధారణంగా రైతులు తమ పంటకు మద్దతు ధర కోసమో లేదా వారికి పంట విషయంలో ఏదైనా ఇబ్బంది తలెత్తినప్పుడు ప్రభుత్వానికి, అధికారులకు వ్యతిరేకంగా ధర్నాలు చేస్తుంటారు. ఇలా ఏదో విషయమై ధర్నా చేసిన ఇద్దరు హర్యానా రైతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో, వారికి మద్దతు తెలుపుతూ ఇతర రైతులు పోలీస్ ​స్టేషన్​ ముందు వెరైటీగా నిరసన తెలిపిన ఘటన వార్తల్లో నిలిచింది.

వివరాలు.. హర్యానాలోని ఫతేహబాద్​ జిల్లాకు చెందిన వికాస్​ సిసర్​, రవి ఆజాద్ అనే ఇద్దరు రైతులు స్థానిక జెజెపీ ఎమ్మేల్యే దేవేంద్ర సింగ్​ బాబ్లీ ఇంటిని ముట్టడించారు. కారణం ఇతడు అధికార బిజేపీతో పొత్తు పెట్టుకోవడం వారికి అస్సలు నచ్చలేదు. వారి మాత్రమే కాదు, స్థానిక  రైతు సంఘాల నాయకులు కూడా ఎమ్మెల్యే తీరును వ్యతిరేకిస్తున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే ఇంటిని చుట్టుముట్టిన వికాస్​, రవి ఆజాద్​లను పోలీసులు అదుపులోనికి తీసుకోవడంతో రైతు సంఘాల నాయకులు అలర్ట్‌ అయ్యారు.

ఫతేహబాద్​ తోహనాలో ఉన్న పోలీస్​ స్టేషన్​ ముందు నిరసన చేపట్టారు. అంతటితో ఆగకుండా, ఒక ఆవును తీసుకొచ్చి స్టేషన్​ ఆవరణలో ఉన్న ఒక స్థంభానికి కట్టారు. ఆవు బాధ్యత పోలీసులదే.. దానికి నీరు, దాణా పెట్టడం వారి కర్తవ్యమే అని తెలిపారు. మాతో పాటే ఆవుకూడా నిరసన తెలుపుతుందన్నారు. ఈ ధర్నాలో ప్రముఖ రైతు నాయకుడు రాకేశ్​ తికాయత్​ కూడా పాల్గొన్నారు. 'తమ సహచరులను విడిచిపెట్టాలని రైతు నాయకులకు, జిల్లా యంత్రాంగానికి మధ్య చర్చలు జరిగాయి. మొదట్లో దీనికి జిల్లా యంత్రాంగం అంగీకరించలేదు. దీంతో రైతులు నిరసన కొనసాగించాలని నిర్ణయం తీసుకోవడంతో వెనక్కు తగ్గిన పోలీసులు అర్దరాత్రి ఇద్దరు రైతులను బెయిల్​ పై విడుదల చేశారని' తెలిపాడు. దీంతో రైతులు స్టేషన్​ ముట్టడిని విరమించారు.

చదవండి: గప్‌చుప్‌లు మనుషులకే కాదు.. మాకు ఇష్టమే 

మరిన్ని వార్తలు