కెనడా స్టూడెంట్‌ వీసా రాలేదని యువకుడి ఆత్మహత్య.. చనిపోయిన మరుసటి రోజే!

20 Aug, 2022 19:34 IST|Sakshi

చండీగఢ్‌: కెనడా స్టూడెండ్‌ వీసా ఆలస్యం అయ్యిందని 23 ఏళ్ల ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే దురదృష్టవశాత్తు అతను మరణించిన రెండు రోజులకే వీసా వచ్చింది. ఈ విషాద ఘటన హర్యానా కురుక్షేత్ర జిల్లాలో చోటుచేసుకుంది. షాబాద్‌ సబ్‌ డివిజన్‌లో గోర్ఖా గ్రామానికి చెందిన వివేక్‌ సైనీ అలియాస్‌ దీపక్‌ డిగ్రీ పూర్తి చేశాడు. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి.  ఉన్నత చదువులు కెనడాలో చదివి అక్కడే స్థిరపడాలని అనుకున్నాడు. తల్లిదండ్రులు ఓకే చెప్పడంతో  వీసా కూడా అప్లై చేశాడు.

దీపక్‌ కొన్ని నెలల కిందట స్నేహితులతో కలిసి కెనడా స్టూడెంట్‌ వీసా కోసం దరఖాస్తు చేశాడు. ఇటీవల వారికి వీసాలు వచ్చాయి. అయితే తనకు వీసా రాకపోవడంపై అతడు నిరాశ చెందాడు. దీంతో జన్సా సమీపంలోని కాలువలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దీపక్‌కు వీసా గురువారం వచ్చింది. అయితే అప్పటికే యువకుడు ఆచూకీ కనిపించకుండా పోయాడు. కొడుకు మిస్‌ అవ్వడంతో  తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు రోజుల అనంతరం కెనాల్‌లో దీపక్‌ మృతదేహం లభ్యమైంది.  పోస్ట్‌మార్టం అనంతరం దీపక్‌ మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

అయితే గురువారమే దీపక్‌ ఇంటికి వీసా వచ్చిందని ఆ గ్రామ మాజీ సర్పంచ్‌ గుర్నామ్ సింగ్ తెలిపాడు. అప్పటికే అతడు ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పాడు. పోలీసులు ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితులకు అప్పటికే వీసా రావడం, తనకు ఇంకా రాలేదనే మనస్థాపంతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసుల దర్యాప్తులో తెలిసింది.
చదవండి: తల్లీ కూతుళ్ల ఆత్మహత్య కేసులో కొత్త ట్విస్టు 

ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్‌ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. 
ఫోన్‌ నెంబర్లు: 040-66202000/040-66202001
మెయిల్: roshnihelp@gmail.com

మరిన్ని వార్తలు