Haryanvi Singer Case: యువ గాయని అపహరణ.. ఆపై దారుణ హత్య!

24 May, 2022 07:49 IST|Sakshi

యువ గాయనిని అపహరించి.. ఆపై 12 రోజుల తర్వాత దారుణంగా హత్య చేసిన ఘటన వెలుగుచూసింది. ఈ ఘటనలో ఆమె మృతదేహం అండర్‌వేర్‌పై మాత్రమే లభించడంతో.. అత్యాచారం జరిగి ఉంటుందని తల్లిదండ్రులు అనుమానిస్తున్నారు. అంతేకాదు ఈ కేసులో పోలీసుల పాత్రపైనా వాళ్లు ఆరోపణలు గుప్పిస్తున్నారు. 

ఢిల్లీకి చెందిన హర్యాన్వీ సింగర్ దివ్య ఇండోరా అలియాస్‌ సంగీత.. దారుణ హత్యకు గురైంది.  రోహ్‌తక్ సమీపంలోని ఓ ఫ్లైఓవర్‌ వద్ద పాతిపెట్టిన ఓ యువతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పరీక్షల అనంతరం .. ఆ మృతదేహం దివ్యదే అని నిర్ధారించారు.  

హర్యాన్వీ సింగర్ సంగీత అలియాస్ దివ్య ఇండోరా మే 11 నుంచి కనిపించకుండా పోయింది. మూడు రోజుల తర్వాత ఆమె పేరెంట్స్‌.. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కిడ్నాప్‌ వ్యవహారంపై ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటు పని చేసే రవి, రోహిత్‌లు.. మ్యూజిక్‌ ఆల్బమ్‌ చేసే వంకతో ఆమెను ఎత్తుకెళ్లి ఉంటారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు సందర్భంగా..  రోహ్‌తక్‌ మెహమ్‌ సమీపంలోని ఓ హోటల్‌లో ఆ ముగ్గురు కలిసి భోజనం చేసిన ఫుటేజీలు వెలుగులోకి వచ్చాయి. 

అయితే ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.  ఆదివారం(22, మే) భైరోన్ భైని గ్రామంలోని బర్సాతి డ్రెయిన్ దగ్గర్లోని ఫ్లై ఓవర్‌ సమీపంలో.. తవ్వకాలు చేస్తుండగా నగ్నంగా పాతిపెట్టి ఉన్న ఓ యువతి మృతదేహాన్ని చూశామంటూ స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు.. పరీక్షల నిర్ధారణ అనంతరం బాధితురాల్ని హర్యాన్వీ సింగర్‌ దివ్య ఇండోరాగా గుర్తించారు పోలీసులు. 

ఇదిలా ఉంటే.. దివ్య తల్లిదండ్రులు పోలీసులపై ఆరోపణలు గుప్పిస్తున్నారు. పోలీసులు సకాలంలో స్పందించి ఉంటే.. దివ్య ప్రాణాలతో దక్కి ఉండేదని అంటున్నారు. అంతేకాదు ఇప్పుడు నిందితుల అరెస్ట్‌ విషయంలోనూ జాప్యం చేస్తున్నారంటూ న్యాయం కోసం స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. ఈ తరుణంలో.. పోలీసులు ఈ వ్యవహారంలో ఓ వ్యక్తిని అరెస్టు చేశామని, మరొకరని త్వరలోనే పట్టుకుంటామని చెప్తున్నారు. దివ్య ఇండోరా మరణంతో..  హర్యాన్వీ గ్రూపులు నివాళులు అర్పిస్తున్నాయి. 

మరిన్ని వార్తలు