పోలీసులను ఆశ్రయించిన హసీన్‌ జహాన్‌

11 Aug, 2020 12:53 IST|Sakshi

హిందూ సోదర, సోదరీమణులకు శుభాకాంక్షలు: నాపై వేధింపులు!

కోల్‌కతా: టీమిండియా క్రికెటర్‌ మహ్మద్‌ షమీపై సంచలన ఆరోపణలు చేసిన అతడి భార్య, మోడల్‌ హసీన్‌ జహాన్‌ మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియాలో తనకు ఎదురవుతున్న వేధింపుల గురించి ఆదివారం ఫిర్యాదు చేశారు. అయోధ్యలో రామ మందిర నిర్మాణ భూమి పూజ సందర్భంగా శుభాభినందనలు తెలిపినందుకు కొంతమంది తనను చంపేస్తామని బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో తనకు, తన కూతురికి రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు. కాగా ఆగష్టు 5న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా రామ మందిర నిర్మాణ భూమి పూజ శాస్త్రోక్తంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో హసీన్‌ జహాన్‌ సంతోషం వ్యక్తం చేస్తూ.. ‘‘హిందువులందరికీ శుభాకాంక్షలు’’ అంటూ విష్‌ చేశారు. దీంతో కొంతమంది నెటిజన్లు ఆమెపై విరుచుకుపడ్డారు. అత్యాచారం చేసి, చంపేస్తామంటూ అసభ్యకర రీతిలో కామెంట్లు చేస్తూ బెదిరింపులకు దిగారు.('అయోధ్య భూమిపూజ: రావణుని గుడిలో వేడుకలు')

ఈ నేపథ్యంలో హసీన్‌ జహాన్‌ కోల్‌కతా సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ‘‘అయోధ్యలో భూమి పూజ సందర్భంగా ఆగష్టు 5, 2020న హిందూ సోదర, సోదరీమణులను ఉద్దేశించి శుభాకాంక్షలు తెలుపుతూ పోస్టు పెట్టగానే కొంతమంది నన్ను అసభ్యపదజాలంతో దూషించారు. మరికొంత మంది రేప్‌ చేసి చంపేస్తామని తరచూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఇది చాలా దురదృష్టకరం. ప్రస్తుత పరిస్థితుల్లో నా రక్షణ, నా కూతురి భవిష్యత్ గందరగోళంలో పడిపోయింది. నేను నిస్సహాయురాలినై పోయాను. అభద్రతాభావం వెంటాడుతోంది. ఇది ఇలాగే కొనసాగితే మానసికంగా కుంగుబాటుకు లోనయ్యే పరిస్థితులు తలెత్తుతాయి. దినదినగండంగా బతుకుతున్నాను. కూతురితో కలిసి ఒంటరిగా జీవిస్తున్నా. మానవతా దృక్పథంతో సత్వరమే స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నా’’అని విజ్ఞప్తి చేశారు.

కాగా ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు. ఇక షమీ తనను హింసిస్తున్నాడని, చంపేందుకు ప్రయత్నించాడని, మ్యాచ్‌ ఫిక్సింగ్‌కు కూడా పాల్పడ్డాడంటూ హసీన్‌ గతంలో ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా వరకట్నం వేధింపుల కేసు కూడా పెట్టారు. దీంతో ఐపీసీ 498ఏ, 354ఏ సెక్షన్ల కింద షమీపై కోల్‌కతా పోలీసులు చార్జ్‌ షీట్‌ దాఖలు చేశారు. ప్రస్తుతం వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారు. హసీన్‌ జహాన్‌ మోడల్‌గా కెరీర్‌ కొనసాగిస్తున్నారు. 

మరిన్ని వార్తలు