హథ్రాస్‌: సందీప్‌ సంచలన ఆరోపణలు.. పోలీసులకు లేఖ

8 Oct, 2020 13:22 IST|Sakshi

మా స్నేహం నచ్చక వాళ్లే చంపేశారు: సందీప్‌ ఠాకూర్‌

అనుమానాలకు తావిస్తున్న పరిణామాలు

లక్నో: దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన హథ్రాస్‌ దళిత యువతిపై సామూహిక అత్యాచారం, హత్య కేసులో మరో కీలక మలుపు చోటుచేసుకుంది. బాధితురాలిని అత్యంత పాశవికంగా హింసించి ఆమె మృతికి కారణమైన ఘటనలో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న సందీప్‌ ఠాకూర్‌, బాధిత కుటుంబంపై సంచలన ఆరోపణలు చేశాడు. తనతో స్నేహం చేయడం నచ్చకపోవడం వల్లే సదరు యువతి తల్లి, సోదరులు ఆమెను తీవ్రంగా కొట్టి గాయపరిచారని, తాము అమాయకులమని తమకు ఏ పాపం తెలియదని పేర్కొన్నాడు. ఘటన జరిగిన రోజు తాను బాధితురాలిని కలిసిన మాట వాస్తమేనని, అయితే తనతో తప్పుగా ప్రవర్తించలేదని చెప్పుకొచ్చాడు. ఈ కేసులో అనవసరంగా తమను ఇరికించారని, లోతుగా దర్యాప్తు చేపట్టి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశాడు. ఈ మేరకు నిందితుడు సందీప్‌ ఠాకూర్‌ హథ్రాస్‌ పోలీసులకు లేఖ రాశాడు. (చదవండి: భయంగా ఉంది.. వెళ్లిపోతాం!)

మేమిద్దరం ఫ్రెండ్స్‌..
‘‘మేమిద్దరం(బాధితురాలు, ప్రధాన నిందితుడు సందీప్‌ ఠాకూర్‌) మంచి స్నేహితులం. అప్పుడప్పుడు కలుసుకునేవాళ్లం. అంతేకాదు ఫోన్లో కూడా మాట్లాడుకునేవాళ్లం. ఆరోజు కూడా తనను కలిసేందుకు వాళ్ల పొలం దగ్గరకు వెళ్లాను. అక్కడ వాళ్ల అమ్మ, సోదరులు కూడా ఉన్నారు. దీంతో వెంటనే నేను ఇంటికి బయల్దేరాను. తనను కూడా రమ్మని చెప్పాను. ఆ తర్వాత పశువులకు మేత వేయడం ప్రారంభించాను. కానీ మా స్నేహం గురించి తెలిసిన తర్వాత, వాళ్ల అమ్మ, సోదరులు తనను తీవ్రంగా కొట్టారని గ్రామస్తుల ద్వారా తెలుసుకున్నాను. 

నిజానికి నేనెప్పుడూ తనపై చెయ్యి చేసుకోలేదు. ఎప్పుడూ తప్పుగా ప్రవర్తించలేదు. వాళ్ల అమ్మావాళ్లు కావాలనే నాపై, మరో ముగ్గురు స్నేహితులపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు.  మేమంతా అమాయకులం. దయచేసి ఈ కేసును లోతుగా విచారించండి’’అంటూ హిందీలో రాసుకొచ్చిన నిందితుడు తనతో పాటు ముగ్గురు సహనిందితుల వేలిముద్రలు వేయించి ఎస్పీకి బుధవారం లేఖ పంపాడు. కాగా ఈ విషయాన్ని అలీఘడ్‌ జైలు అధికారులు ధ్రువీకరించారు. నిందితులు తమ వాదనతో ముందుకు వచ్చారని, ఈ విషయంలో దర్యాప్తు సంస్థలు ఎలా ముందుకు సాగుతాయో చూడాల్సి ఉందని మీడియాతో పేర్కొన్నారు. 

అనుమానాలకు తావిస్తున్న పరిణామాలు
హథ్రాస్‌లో 19 ఏళ్ల దళిత యువతిని పొలాల నుంచి లాక్కెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడి, నాలుక కోసి, వెన్నెముక విరిచేసి అత్యంత అమానుషంగా ప్రవర్తించడంతో ఢిల్లీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చిన పోలీసులు రాత్రి రాత్నే అంత్యక్రియలు నిర్వహించడం సహా బాధితురాలిపై లైంగిక దాడి జరగలేదని చెప్పడం పట్ల సందేహాలు వ్యక్తమయ్యాయి. ఆధారాలు మాయం చేసేందుకే ఆమె శవాన్ని కాల్చి బూడిద చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

ఈ నేపథ్యంలో ఆధిపత్య వర్గానికి చెందిన నిందితుల సామాజికవర్గం వారి తరఫున ఓ లాయర్‌ను నియమించడం, ఆ తర్వాత బాధితురాలికి, నిందితుడికి మధ్య ఫోన్‌ సంభాషణ జరిగిందంటూ పోలీసులు కాల్‌ డేటా లభించినట్లు చెప్పడం, అనంతరం కుటుంబ సభ్యులే బాధితురాలిని చంపేశారంటూ గ్రామ పెద్ద ఆరోపించడం, ఇప్పుడు నిందితుడు సైతం అదే రకమైన ఆరోపణలు చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఇదిలా ఉండగా.. బాధిత కుటుంబానికి ప్రాణహాని పొంచి ఉందన్న నేపథ్యంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు.. యోగి సర్కారు వారికి భద్రత ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. 
 

మరిన్ని వార్తలు