అర్ధరాత్రి యువతి మృతదేహానికి అంత్యక్రియలు!

30 Sep, 2020 10:38 IST|Sakshi

తెగిన నాలుక, పక్షవాతం.. యువతిపై దమనకాండ

గుండె పగిలేలా రోదించిన బాధితురాలి తల్లి

అర్ధరాత్రి అంత్యక్రియలు చేయడం పట్ల విమర్శలు

ఇలాంటి పరిస్థితి పగవాళ్లకు కూడా వద్దు!

లక్నో: సామూహిక అత్యాచారానికి గురై ఢిల్లీ ఆస్పత్రిలో కన్నుమూసిన దళిత యువతి మృతదేహాన్ని స్వస్థలానికి తరలించే క్రమంలో తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. నిర్భయ ఘటనను తలపించిన ఈ ఉదంతంలో పోలీసులు వ్యవహరించిన తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తొలుత ఫిర్యాదు తీసుకోవడంలోనూ, ఇప్పుడు మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే సమయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించారంటూ మండిపడుతున్నారు. తమ సంప్రదాయానికి విరుద్ధంగా అర్ధరాత్రి శవ దహనం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి దుస్థితి ఎవరికీ రాకూడదంటూ బాధితురాలి తల్లి విలపించిన తీరు ప్రతి ఒక్కరి చేత కంటతడి పెట్టిస్తోంది. 

కాగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందిన 20 ఏళ్ల యువతిపై ఆధిపత్య కులానికి చెందిన నలుగురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన విషయం విదితమే. పొలంలో పనిచేసుకుంటున్న బాధితురాలిని లాక్కెళ్లి చిత్ర హింసలకు గురిచేసి లైంగిక దాడికి పాల్పడ్డారు. నాలుక కోసి, వెన్నెముక విరిగేలా రాక్షసంగా వ్యవహరించారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను తొలుత అలీఘర్‌లో చికిత్స అందించినా ఫలితం లేకపోవడంతో, ఢిల్లీలోని సఫ్దార్‌జంగ్‌ ఆస్పత్రికి తరలించారు. పక్షవాతం, శరీరంలోని ప్రధాన భాగాలన్నీ తీవ్రంగా దెబ్బతినడంతో రెండు వారాలుగా చిత్రవధ అనుభవించిన బాధితురాలు కన్నుమూసింది.(చదవండి: నాలుక కోసి చిత్రహింసలు.. యువతి మృతి)

ఇంట్లో పెట్టి తాళం వేశారు..
ఈ క్రమంలో మంగళవారం ఆమె మృతదేహాన్ని స్వస్థలానికి తీసుకువచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగే అవకాశం ఉన్నందున, రాత్రి రాత్రే అంత్యక్రియలు చేయాలని పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులకు సూచించారు. అయితే ఇది తమ సంప్రదాయానికి విరుద్ధమని, శవాన్ని ఇంటికి తీసుకువెళ్లి, రేపు ఉదయమే దహనం చేస్తామని ఆమె తండ్రి పోలీసులకు చెప్పారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాదోపదవాదాలు జరగాయి. పోలీసుల తీరును నిరసిస్తూ గ్రామస్తులు, బాధితురాలి బంధువులు వారి వాహనాలకు అడ్డుగా నిలిచి నిరసన తెలిపారు.

అయినప్పటికీ అర్ధరాత్రి రెండున్నర గంటల సమయంలో పోలీసులు ఆమె మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. తమ విన్నపాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కూతురిని కడచూపునకు నోచుకోకుండా చేశారంటూ ఆమె తల్లి గుండెలు బాదుకుంటూ రోదించడం అందరి మనసులను మెలిపెట్టింది. (చదవండి: 8 రోజులు ఏం చేశారు? )

కాగా తమను ఇంట్లో పెట్టి తాళం వేసి, బంధువులను, మీడియా రిపోర్టర్లను అడ్డుకుంటూ పోలీసులు మానవ హారంలా నిల్చుని, ఇంత హడావుడిగా మృతదేహాన్ని దహనం చేయడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇక తొలుత ఈ కేసులో హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు, బాధితురాలి వాంగ్మూలం తర్వాత అత్యాచార కేసు నమోదు చేశారు. ఫోరెన్సిక్‌ నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు వెల్లడించారు. సామూహిక అత్యాచారానికి పాల్పడిన నలుగురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. హత్యానేరం కింద కూడా కాగా ఈ కేసులో పోలీసుల తీరుపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి.  

సీఎం యోగికి ప్రధాని మోదీ ఫోన్‌
హత్రాస్‌ హత్యాచార ఉదంతంపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తో ఫోన్‌లో మాట్లాడారు. హత్రాస్‌ దారుణోదంతం కేసులో సత్వరం చర్యలు తీసుకోవాలని మోదీ ఆదేశించారు. కాగా ఈ ఘటనపై స్పందించిన సీఎం యోగి లోతైన విచారణ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్‌) ఏర్పాటు చేశారు.

మరిన్ని వార్తలు