Hayathnagar: బ్లాంకెట్‌లో మహిళ మృతదేహం కలకలం

24 Sep, 2021 11:49 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: హయత్‌నగర్‌లో గుట్టుచప్పుడు కాకుండా మహిళ మృతదేహాన్ని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను స్థానిక యువకులు అడ్డుకున్నారు. పోలీసులకు సమాచారం అందించి.. వారిని అప్పగించారు. హయత్‌నగర్‌లోని తొర్రూరు రోడ్డులో ఉన్న బాతుల చెరువు సమీపంలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సదరు వ్యక్తులు గురువారం రాత్రి 10 గంటల సమయంలో మహిళ మృతదేహాన్ని ఓ దుప్పటిలో చుట్టి తీసుకెళ్తుండగా స్థానికులు గమనించారు.

బ్లాంకెట్‌లో ఏమిటని ప్రశ్నించగా.. సదరు వ్యక్తులు పొంతన లేని సమాధానం చెప్పారు. దాంతో అనుమానం వచ్చిన స్థానికులు వారిద్దరిని చితకబాది పోలీసులకు అప్పగించారు. అనుమానితుల్లో ఒక వ్యక్తి తన పేరు శ్రీనివాస్‌ అని.. బ్లాంకెట్‌లో ఉన్నది తన భార్య మృతదేహం అని.. తమది లవ్‌ మ్యారేజ్‌ అని చెప్పాడు. ఆమె ఎలా చనిపోయిందని అని అడిగితే.. శ్రీనివాస్‌ సరైన సమాధానం చెప్పలేదు.

(చదవండి: శవం తెచ్చిన తంటా.. ఇద్దరు ఆలయ అధికారుల సస్పెండ్‌)

దీంతో అనుమానంతో పోలీసులకు వారిని పట్టించారు. వారిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. ఇక మహిళ ఒంటి మీద ఎలాంటి బట్టలు లేకపోవడంతో పలు అనుమానాలు తలెత్తుతున్నాయి. మృతురాలిని డేగ లక్ష్మీగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన డేగ లక్ష్మి, నెల్లూరుకి చెందిన శ్రీనివాస్‌కు 12 ఏళ్ల కిందట ప్రేమ వివాహంమైంది. వీరికి ఒక బాబు, ఒక పాప ఉన్నారు. రెండేళ్ల కిందట బతుకుదెరువు కోసం శ్రీనివాస్‌ హైదరాబాద్ వచ్చాడు. తాపీమేస్త్రీ పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. అయితే కొంతకాలంగా  తన భార్య అనారోగ్యంతో బాధపడుతోందని.. ఈక్రమంలోనే ఆమె మృతి చెందినట్లు శ్రీనివాస్‌ చెప్పినట్టు సమాచారం.
(చదవండి: పెన్షన్‌ డబ్బుల కోసం.. తల్లి మృతదేహాన్ని ‘మమ్మీ’గా మార్చి)

డబ్బులు లేక స్నేహితుడి సహాయంతో ఎక్కడన్నా దహన సంస్కారాలు చేద్దామని తీసుకువెళ్తున్నట్లు శ్రీనివాస్‌ పోలీసుల విచారణలో తెలిపాడు. పోస్ట్‌మామార్టం రిపోర్ట్ వచ్చాకే లక్ష్మి మృతికి కారణాలు తెలుస్తాయంటున్నారు పోలీసులు. ప్రస్తుతం లక్ష్మి మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. 

చదవండి: ఆ బాడీ దొరికితేనే సంచలన కేసు కొలిక్కి: కృష్ణానదిలో గాలింపు ముమ్మరం

మరిన్ని వార్తలు