మమ్మల్ని సాదుతానని మధ్యలోనే వెళ్లిపోయింది 

25 Aug, 2021 07:15 IST|Sakshi
మౌనిక రాసినట్లుగా భావిస్తున్న సూసైడ్‌ నోట్‌

మా బిడ్డ ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు 

హెచ్‌సీయూ యాజమాన్యానిదే బాధ్యత  

ఆమె మృతికి కారణాలను అన్వేషించాలి 

కన్నీరుమున్నీరైన మౌనిక తండ్రి లచ్చయ్య  

గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు 

గచ్చిబౌలి: ‘నా చిన్న బిడ్డను కొడుకే అనుకున్నం.. కొండంత ధైర్యంగ ఉన్నం.. కానీ.. ఇలా మధ్యలోనే వదిలి వెళ్తదనుకోలే. మూణ్నెళ్లు అయితే నా చదువు పూర్తయితది.. మిమ్ముల్ని సాదేది నేనే అన్నది. మౌనికకు ఎలాంటి ఇబ్బందులు లేవు.. ఆమె చావుకు కారణాలేమిటో పోలీసులే తేల్చాలి’ అని హెచ్‌సీయూ ఎంటెక్‌ విద్యార్థిని ఆర్‌.మౌనిక తండ్రి లచ్చయ్య గచ్చిబౌలి పీఎస్‌లో కన్నీరు మున్నీరుగా విలపించారు. రోజంతా గది నుంచి బయటకు రాకున్నా యూనివర్సిటీ యాజమాన్యం ఎందుకు పట్టించుకోలేదని, కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని మంగళవారం గచ్చిబౌలి పీఎస్‌లో ఆయన ఫిర్యాదు చేశారు.

శనివారం సాయంత్రం తల్లితో మంచిగానే మాట్లాడిందని, ఆదివారం నుంచి ఫోన్‌ ఎత్తలేదని లచ్చయ్య తెలిపారు. తన కూతురు చనిపోయేంత పిరికి కాదని, తమకే ధైర్యం చెప్పేదని అన్నారు. యూనివర్సిటీలోనే ఏమో జరిగిందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు. పెళ్లి విషయంలో ఎప్పుడూ ఒత్తిడి చేయలేదన్నారు. హెచ్‌సీయూలో నానో సైన్స్‌లో ఎంటెక్‌ రెండో సంవత్సరం చదువుతున్న మౌనిక (27) హాస్టల్‌ గదిలో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. ఆమె ఆత్మహత్యకు కారణాలేమిటో తెలియడంలేదని పోలీసులు చెబుతున్నారు.  

షన్నూ.. ఐ మిస్‌ యూ.. 
‘ఐ యామ్‌ ద రీజన్‌ ఫర్‌ ఎవ్రీ థింగ్, ఐయామ్‌ నాట్‌ ఎ గుడ్‌ డాటర్, వెరీ వెరీ సారీ అమ్మ, నాన్న. ఐ లవ్‌ యూ ఆల్, షన్ను మిస్‌యూ అంటూ బాసర ట్రిపుల్‌ ఐటీ సెమిస్టరీ మార్కుల మెమోపై మౌనిక సూసైడ్‌ నోట్‌ రాసింది. తన అక్క కూతురు షన్నును మిస్‌ అవుతున్నానని పేర్కొంది.  

క్యాట్‌కు సెల్‌ఫోన్‌.. 
మౌనిక ఆత్మహత్యకు గల కారణాలను గచ్చిబౌలి పోలీసులు అన్వేషిస్తున్నారు. ఆమె సెల్‌ ఫోన్‌ ఓపెన్‌ కాకపోవడంతో క్యాట్‌కు పంపారు. చాటింగ్, మెసేజ్‌ ద్వారా ఏదైనా క్లూ లభించే అవకాశం ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. ప్రేమ వ్యవహరం ఏమైనా ఉందనే కోణంలోనూ ఆరా తీస్తున్నారు.

మరిన్ని వార్తలు