సెల్‌ఫోన్‌ దొంగిలించాడని కొట్టి చంపేశారు

8 Jan, 2022 08:38 IST|Sakshi

దుండిగల్‌: సెల్‌ఫోన్‌ దొంగిలించాడనే నెపంతో ఓ వ్యక్తిని తల్లి కొడుకులు కలిసి తీవ్రంగా కొట్టడంతో మృతి చెందాడు.. హత్యానేరం నుంచి తప్పించుకునేందుకు మృతదేహాన్ని నిర్మానుష్య ప్రాంతంలో పడేసి తప్పించుకునే ప్రయత్నం చేశారు. దీనిపై పోలీసులు కూపీ లాగడంతో అసలు హంతకులు పట్టుబడిన ఘటన దుండిగల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...   శ్రీకాకుళం జిల్లా, ఇచ్చాపురానికి చెందిన దండసాయి రమేష్‌ (35) వృత్తిరీత్యా హోటళ్లల్లో చెఫ్‌గా పని చేసేవాడు.  నగరానికి వలస వచ్చిన అతను సూరారం కాలనీలో ఉంటూ స్థానికంగా ఉంటున్న హోటళ్లల్లో పని చేస్తున్నాడు.  

నెల రోజుల క్రితం గండిమైసమ్మలోని జెఎంజే టిఫిన్‌ సెంటర్‌లో చెఫ్‌గా చేరాడు. అయితే డిసెంబరు 26న  హోటల్‌లో సెల్‌ఫోన్, నగదు చోరీకి గురయ్యాయి. రమేష్‌పై అనుమానంతో హోటల్‌ నిర్వాహకుడు రాకేశ్, అతని తల్లి భాగ్యలక్ష్మి అతన్ని చేతులు కట్టేసి కొట్టారు. అయినా ఒప్పుకోకపోవడంతో వెదురు కట్టెలతో తలపై బలంగా కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో హత్యానేరం నుండి తప్పించుకునేందుకు రాకేష్‌ అతని  స్నేహి తులు వెంకటసాయి, వినయ్, మున్నా, సతీశ్, సంపత్, అజారుద్దీన్‌లు మృతదేహాన్ని బహదూర్‌పల్లి సాయినాథ్‌ సొసైటీలో రోడ్డు పక్కన పడేసి వెళ్లిపోయారు.

పట్టుబడిందిలా.. 
సాయినాథ్‌ సొసైటీలోని రోడ్డు పక్కన మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుండిగల్‌ పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంగా కేసు నమోదు చేశారు. కాగా మృతుడి ప్యాంట్‌జేబులో లభించిన ఫోన్‌ నంబర్‌ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.  రమేష్‌ పలు హోటళ్లలో చెఫ్‌గా పని చేసేవాడని తెలుసుకున్నారు. గండిమైసమ్మలోని జెఎంజే హోటల్‌లో పని చేస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు స్థానికులను విచారించగా గొడవ విషయం వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించగా రమేష్‌ను కొడుతున్న దృశ్యాలు లభించాయి. దీంతో హోటల్‌ నిర్వాహకుడు రాకేశ్‌ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా తీవ్రంగా కొట్టడంతోనే మృతి చెందాడని, మృతదేహాన్ని సాయినాథ్‌ సొసైటీ సమీపంలో పడేసినట్లు అంగీకరించాడు. దీంతో రాకేశ్‌తో పాటు అతని స్నేహితులను అదుపులోకి తీసుకున్నారు. కాగా రాకేశ్‌ తల్లి భాగ్యలక్ష్మి పరారీలో ఉన్నట్లు తెలిసింది.   

మరిన్ని వార్తలు