సర్పంచ్‌ కట్టించిన శ్మశానవాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం 

3 May, 2023 03:51 IST|Sakshi

పరకాల: ఓ సర్పంచ్‌ కొత్తగా కట్టించిన శ్మశానవాటిక.. ఆయన దహన సంస్కారాలతోనే ప్రారంభమయ్యింది. ఈ దురదృష్టకర ఘటన హనుమకొండ జిల్లా పరకాల మండలం హైబోతుపల్లిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే... హైబోతుపల్లి గ్రామ సర్పంచ్‌ కంచ కుమారస్వామి (25) కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉంది. కలహాలతో భార్య పుట్టింటికి వెళ్లింది. మనస్తాపంతో సర్పంచ్‌ గత నెల 29న పురుగుల మందు తాగాడు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం చనిపోయాడు.

కాగా, ఆ గ్రామాన్ని ఇటీవలే గ్రామపంచాయతీగా ప్రకటించారు. సర్పంచ్‌ కంచ కుమారస్వామి ఆధ్వర్యంలో గ్రామంలో శ్మశాన వాటిక (వైకుంఠధామం) నిర్మించారు. కానీ ప్రారంభించలేదు. ఈ క్రమంలో సర్పంచ్‌ కుమారస్వామి ఆత్మహత్య చేసుకోవడంతో.. కుటుంబ సభ్యులు ఆయన మృతదేహానికి అదే శ్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. సర్పంచ్‌ కట్టించిన శ్మశాన వాటికలో ఆయనదే తొలి దహన సంస్కారం కావడంతో గ్రామస్తులంతా కంటనీరు పెట్టుకున్నారు.

మరిన్ని వార్తలు