కూతురు లేని లోకంలో ఉండలేను!

9 Dec, 2020 11:00 IST|Sakshi

విభేదాలతో పెంపుడు కూతురు ఆత్మహత్య 

మనస్తాపంతో హెడ్‌ కానిస్టేబుల్‌ బలవన్మరణం 

‘శాంతివనం’లో విషాదం  

సాక్షి, కర్నూలు/బనగానపల్లె: ‘నన్నెవరూ అర్థం చేసుకోవడం లేదు. నాకింత కాలం సహకరించిన వారందరికీ ధన్యవాదాలు. బనగానపల్లెలో నా పెంపుడు కూతురు శివజ్యోతి ఆత్మహత్య చేసుకుంది. ఆమె లేని లోకంలో నేను ఉండలేనం’టూ  పోలీస్‌ కమ్యూనికేషన్‌ విభాగంలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యంశెట్టి(49) ఇంట్లో ఫ్యాన్‌కు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. బనగానపల్లెలోని శాంతివనం వృద్ధాశ్రమం నిర్వహణలో కీలకంగా ఉన్న సుబ్రహ్మణ్యంతో పాటు ఆయన పెంపుడు కుమార్తె శివజ్యోతి (28) ఒకే రోజు ఆత్మహత్య చేసుకోవడం ఆశ్రమంలో విషాదాన్ని నింపింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. 

సుబ్రహ్మణ్యంశెట్టి స్వగ్రామం కోవెలకుంట్ల. ప్రజాసేవ చేయాలనే తపనతో వివాహం కూడా చేసుకోలేదు. ఒకవైపు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూనే... మరోవైపు కొన్నేళ్లుగా  బనగానపల్లెలోని యాగంటిపల్లె రోడ్డులో శాంతివనం పేరిట వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నారు. విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి చెందిన శివజ్యోతి పదమూడేళ్ల క్రితం ఆశ్రమానికి చేరి..వృద్ధులకు సేవ చేస్తుండేది. ఆమెను సుబ్రహ్మణ్యం దత్తపుత్రికగా పిలుస్తుండేవారు. డ్యూటీ సమయంలో ఆయన ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆశ్రమ నిర్వహణ బాధ్యత శివజ్యోతి చూసేది. ఆయనకు రెండు నెలల క్రితం కర్నూలుకు బదిలీ అయ్యింది. దీంతో ఆశ్రమ బాధ్యతలను శివజ్యోతికి అప్పగించి కర్నూలు గాంధీనగర్‌ పక్కనున్న నంద్యాల గేట్‌ ప్రాంతంలోని అద్దె ఇంట్లో ఉంటుండేవాడు.  చదవండి: (హైటెక్‌ వ్యభిచారం: వాట్సాప్‌లో ఫొటోలు.. ఓకే అయితే)

ఆయనకు గతంలో ఓ మహిళతో పరిచయం ఏర్పడి వివాదం తలెత్తడంతో రెండుసార్లు ఆత్మహత్యకు యత్నించాడు. కాగా.. శివజ్యోతి మంగళవారం ఉదయం సుబ్రహ్మణ్యంశెట్టితో ఫోన్‌లో మాట్లాడింది. ఆశ్రమ పునర్నిర్మాణ విషయంలో వారి మధ్య వాగ్వాదం జరిగినట్లు సమాచారం. తర్వాత శివ జ్యోతికి ఫోన్‌ చేయగా.. ఆమె లిఫ్ట్‌ చేయకపోవడంతో సుబ్రహ్మణ్యంకు అనుమానం వచ్చింది. అక్కడ పని చేస్తున్న తాపీ మేస్త్రీలకు ఫోన్‌ చేసి ఆరా తీశారు. ఆమె తలుపులు  తెరవడం లేదని వారు సమాచారమిచ్చారు. తర్వాత సుబ్రహ్మణం సూచన మేరకు తలుపులు పగులగొట్టి చూడగా.. శివజ్యోతి సీలింగ్‌ ఫ్యాన్‌కు ఉరేసుకుని మృతి చెందిన విషయం వెలుగు చూసింది. దీంతో కూతురు లేని లోకంలో తాను ఉండలేనంటూ సుబ్రహ్మణ్యం సూసైడ్‌ నోట్‌ రాసి కర్నూలులోని ఇంట్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన మృతదేహాన్ని కర్నూలు ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి, శివజ్యోతి మృతదేహాన్ని బనగానపల్లె ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీకి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. చదవండి: (అనుమానాగ్నిలో బంధాలు భస్మీపటలం)

మరిన్ని వార్తలు