ఫొటో ఫ్రేమ్‌ల్లో డ్రగ్స్‌!

12 Nov, 2021 03:38 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు రవాణా కోసం ముఠా యత్నం

రూ. 5.5 కోట్ల విలువైన 14.2 కేజీల సూడో ఎఫిడ్రిన్‌ పార్సిల్‌ బుకింగ్‌

డీఆర్‌ఐ సమాచారంతో స్వాధీనం చేసుకున్న పోలీసులు 

సాక్షి, హైదరాబాద్‌: తమిళనాడుకు చెందిన ముఠాలు హైదరాబాద్‌ మీదుగా ఆస్ట్రేలియాకు డగ్స్‌ రవాణాకు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఇప్పటికే జిమ్‌ ఉపకరణాల మధ్యలో ఓసారి, పరుపుల్లో మరోసారి విదేశాలకు సూడోఎఫిడ్రిన్‌ రవాణాకు యత్నించగా డీఆర్‌ఐ, ఎన్సీబీ అధికారులు పట్టుకున్నారు. దీంతో కేటుగాళ్లు రూటు మార్చారు. తాజాగా ఫొటో ఫ్రేమ్‌ల మధ్యలో ఈ డ్రగ్‌ను ఉంచి రవాణాకు యత్నించారు. డీఆర్‌ఐ అధికారులు ఇచ్చిన సమాచారంతో బేగంపేట పోలీసులు రూ. 5.5 కోట్ల విలువైన 14.2 కేజీల ‘సరుకు’ను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌ అంజనీకుమార్‌ గురువారం తెలిపారు. నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగెనవర్, బేగంపేట ఏసీపీ నరేశ్‌రెడ్డితో కలసి గురువారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొత్వాల్‌ మాట్లాడారు. 

ప్లాస్టిక్‌ కవర్లలో నింపి... 
సీపీ తెలిపిన వివరాల ప్రకారం... తమిళనాడు డ్రగ్స్‌ గ్యాంగ్‌ సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు పంపేందుకు పక్కా ప్రణాళిక రచించింది. డ్రగ్స్‌ను దాచేందుకు వివిధ ఫొటోలతో కూడిన ఫ్రేములను రెండు పొరలుగా తయారు చేయించింది. ఈ రెంటి మధ్యలో ఫ్రేముల సైజులోనే ఉన్న ప్లాస్టిక్‌ కవర్లలో సూడో ఎఫిడ్రిన్‌ నింపింది. ఫ్రేము పొరల మధ్య దీన్ని ఉంచి ప్లాస్టర్‌ వేసింది. ఇలా 18 కేజీల చొప్పున ఉన్న ఒక్కో కార్టన్‌ బాక్సులో 11 ఫ్రేములను ఉంచుతూ రెండు పార్శిల్స్‌ రూపొందించింది. వాటిని మంగళవారం బేగంపేట ప్రకాశ్‌నగర్‌లో ఉన్న యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరియర్‌ సంస్థ వద్దకు ఇద్దరు వ్యక్తులు తీసుకువచ్చారు.

స్థానిక చిరునామాలతో కూడిన నకిలీ ఆధార్‌ కార్డులు చూపి వాటి ఆధారంగా ఫొటో ఫ్రేమ్‌ల పార్శిల్స్‌ను ఆస్ట్రేలియాకు బుక్‌ చేశారు. మొదటి దాన్ని సిడ్నీ శివార్లలో ఉన్న వెస్ట్‌మేడ్‌ ప్రాంతంలో గణేశన్‌ పెరుమాళ్‌కు, రెండో దాన్ని గ్రాన్‌వెల్లీలో రఘునాథ్‌ శరవణ్‌కు డెలివరీ చేయాలని కోరారు. హైదరాబాద్‌ నుంచి ఆస్ట్రేలియాకు సూడో ఎఫిడ్రిన్‌ అక్రమంగా రవాణా అవుతున్నట్లు డీఆర్‌ఐ అధికారులకు ఉప్పందడంతో వాళ్లు నగర పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోని దిగిన బేగంపేట పోలీసులు యునైటెడ్‌ ఎక్స్‌ప్రెస్‌ కొరియర్స్‌ సంస్థలో సోదాలు చేయగా 14.2 కేజీల డ్రగ్‌ బయటపడింది. ఈ పార్శిల్స్‌ బుకింగ్‌ చేసిన ఇద్దరినీ గుర్తించడానికి కొరియర్‌ సంస్థతోపాటు ఆ చుట్టు పక్కల ప్రాంతాల్లోని సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్‌ను బేగంపేట పోలీసులు సేకరించారు. దీన్ని విశ్లేషిస్తూ నిందితుల్ని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. 

ఏడాదిగా ప్రయత్నం... 
గత ఏడాదిగా తమిళనాడు ముఠా సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియాకు స్మగ్లింగ్‌ చేయడానికి ప్రయత్నిస్తోంది. చెన్నై, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్‌ల నుంచి సీ కార్గో, ఎయిర్‌ కార్గో, కొరియర్‌ల ద్వారా వివిధ రూపాల్లో పార్శిల్స్‌ చేసింది. ఇప్పటివరకు 15 కేసులు నమోదు చేసిన డీఆర్‌ఐ... 300 కేజీలకుపైగా ఎఫిడ్రిన్‌ సీజ్‌ చేసింది. ఈ వ్యవహారంలో సూత్రధారుల కోసం అటు డీఆర్‌ఐ, ఇటు నగర పోలీసులు గాలిస్తున్నారు.  
 

చదవండి: 'నూటొక్క జిల్లాల అందగాడు': విగ్గుతో అమ్మాయిలకు వలేస్తాడు.. ఆ తర్వాత..

మరిన్ని వార్తలు