భారీగా ఎర్రచందనం పట్టివేత 

23 Aug, 2021 08:19 IST|Sakshi
పోలీసులు సీజ్‌ చేసిన వాహనం, పట్టుబడిన ఎర్ర చందనం దుంగలు

కర్నూలు (ఓల్డ్‌సిటీ)/ఓర్వకల్లు: కర్నూలు సమీపంలోని నన్నూర్‌ టోల్‌గేట్‌ ప్లాజా వద్ద భారీగా ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారం ప్రకారం వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా సాయంత్రం 4.05 గంటల సమయంలో హైదరాబాద్‌ నుంచి చెన్నైకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 177 ఎర్రచందనపు దుంగలను గుర్తించారు. లారీతో సహా వీటిని స్వాధీనం చేసుకొని ఓర్వకల్లు పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ఇవి 3.84 టన్నుల బరువున్నాయని, రూ. 3.84 కోట్ల విలువ చేస్తాయని కర్నూలు డీఎస్పీ వెంకట్రామయ్య తెలిపారు. ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన మాగుంట విశ్వనాథ్‌రెడ్డి అలియాస్‌ ప్రసాద్‌రెడ్డి కొంతకాలం నుంచి ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తున్నట్లు డీఎస్పీ చెప్పారు.

చదవండి: అడ్డదారిలో అక్రమ కిక్కు..!


జైల్లో ఉన్న నిందితుడిని  పోలీసులు విచారించగా శంషాబాద్‌ గోడౌన్ల్లలో ఉన్న ఎర్రచందనం దుంగలను కల్లూరు ఎస్టేట్‌కు చెందిన కంద గడ్డల సుబ్బారావు కుమారుడు శివకుమార్‌ (లారీ డ్రైవర్‌ కమ్‌ ఓనర్,  స్కంద వెంచర్‌లో పనిచేస్తున్న నజీర్‌ అనే వ్యక్తి సహకారంతో చెన్నైకి తరలిస్తున్నట్లు చెప్పారన్నారు. పక్కా సమాచారంతో ఎర్రచందనం దుంగులను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. లారీ డ్రైవర్‌ శివకుమార్‌ను అరెస్టు చేశామని, నజీర్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.  గతంలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ చేస్తుండగా శివకుమార్‌ను పోలీసులు అరెస్టు చేశారని, బెయిల్‌పై వచ్చి అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. తనిఖీల్లో కర్నూలు రూరల్‌ సీఐ ఎం. శ్రీనాథ్‌రెడ్డి, కర్నూలు మూడో పట్టణ పోలీస్‌ స్టేషన్‌ సీఐ ఎం.తబ్రేజ్, ఓర్వకల్లు ఎస్‌ఐ మల్లికార్జున సిబ్బందితో పాల్గొన్నారు.

చదవండి: పేదల వకీల్‌ తరిమెల బాలిరెడ్డి కన్నుమూత 

>
మరిన్ని వార్తలు