భారీగా ఎర్రచందనం స్వాధీనం

6 Feb, 2022 04:37 IST|Sakshi
ఎర్రచందనం దుంగలను పరిశీలిస్తున్న ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్, పోలీసు అధికారులు

ప్రకాశంలో 20, చిత్తూరులో 14 దుంగలు స్వాధీనం 

ఐదుగురు స్మగ్లర్ల అరెస్టు, మూడు వాహనాలు సీజ్‌

కడప అర్బన్‌/చంద్రగిరి:  వైఎస్సార్, చిత్తూరు జిల్లాల్లో శనివారం పోలీసులు పెద్ద ఎత్తున ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకుని ఐదుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు. మూడు వాహనాలను సీజ్‌ చేశారు. వైఎస్సార్‌ జిల్లా కాశినాయన మండలం ఆకులనారాయణ పల్లి సమీపంలోని అడవుల్లో నిందితులు ఎర్రచందనం చెట్లను నరికి, దుంగలుగా తయారుచేసి వాహనాల్లోకి ఎక్కించి తరలించడానికి సిద్ధంగా ఉంచారు. ఆ సమయంలో పోరుమామిళ్ల సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఏ కాశినాయన ఎస్‌ఐ అరుణ్‌రెడ్డి తమ సిబ్బందితో దాడి చేసి నలుగురిని అరెస్ట్‌ చేశారు.

వారి వద్ద నుంచి 455 కిలోల బరువున్న 20 ఎర్రచందనం దుంగలు, 2 వాహనాలను  స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో జిల్లాలోని బి.మఠం మండలం సోమిరెడ్డి పల్లెకు చెందిన దేవర్ల సుబ్రమణ్యం, ప్రకాశం జిల్లా సంతమాగులూరు మండలం మీనేకళ్లు గ్రామానికి చెందిన రావూరి ఉమాశంకర్, కొమరోలు మండలం అక్కపల్లికి చెందిన ధనపాటి రమణయ్య, అదే మండలానికి చెందిన భూమ వసంతకుమార్‌ ఉన్నారు. ఎవరైనా ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడినా, వారికి సహకరించినా కఠినచర్యలు తీసుకుంటామని ఎస్పీ  అన్బురాజన్‌ హెచ్చరించారు.   

కూరగాయల మాటున.. 
చిత్తూరు జిల్లా టాస్క్‌ఫోర్స్‌ ఎస్పీ ఆదేశాల మేరకు.. ఆర్‌ఎస్‌ఐ వాసు సిబ్బందితో కలసి శనివారం 3 గంటల సమయంలో మూలపల్లి వద్ద వాహన తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో ఓ ఐచర్‌ వాహనం ఆపకుండా వేగంగా అధికారులను దాటి వెళ్లిపోవడంతో  దానిని వెంబడించారు. కొంతదూరం వెళ్లగానే వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న ముళ్లకంపలోకి దూసుకెళ్లింది. వాహనం తనిఖీ చేయగా సుమారు 14 ఎర్రచందనం దుంగలు ఉన్నాయి. ఆర్‌ఎస్‌ఐ వాసు మాట్లాడుతూ.. ఐచర్‌ వాహనం కింది భాగంలో ఎర్రచందనం ఉంచి, దానిపైన చెక్కలు ఏర్పాటు చేసి కూరగాయలను రవాణా చేసే వాహనం మాదిరి చేశారని తెలిపారు. దాడుల్లో పట్టుబడిన డ్రైవర్‌ తిరుపతికి చెందిన ప్రభాకర్‌గా గుర్తించామన్నారు. అనంతరం వాహనంతో పాటు ఎర్రచందనం, నిందితుడిని చంద్రగిరి పోలీసులకు అప్పగించారు. 

మరిన్ని వార్తలు