నిందితుల కస్టడీకి.. పోలీసుల పిటిషన్‌

28 Sep, 2020 09:35 IST|Sakshi
హేమంత్‌ కుమార్‌, అవంతి పెళ్లి ఫొటో (ఫైల్‌)

సాక్షి, హైదరాబాద్‌:  హేమంత్‌ కుమార్‌ హత్య కేసును మరింత లోతుగా దర్యాప్తు చేయాల్సిన అవసరముందంటూ పోలీసులు న్యాయస్థానంలో పిటిషన్‌ దాఖలు చేశారు. నిందితులను వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ అందులో పేర్కొన్నారు. హేమంత్‌ కుమార్‌ హత్య కేసులో నిందితులకు శిక్ష పడేందుకు కావాల్సిన పూర్తి సమాచారంతో పాటు శాస్త్రీయ ఆధారాలు సేకరించేందుకు విచారించాల్సిన అవసరముందని కస్టడీ పిటిషన్‌లో కోరారు. ఇదిలాఉండగా కుటుంబసభ్యులైన అశిష్‌రెడ్డి, సందీప్‌ రెడ్డి వల్ల కూడా తమ కుటుంబానికి ప్రాణహని ఉందని  హేమంత్‌ కుమార్‌ భార్య అవంతిరెడ్డి ఆరోపించారు. మామయ్య మురళీ కృష్ణకు సందీప్‌రెడ్డి ఫోన్‌కాల్‌ చేసి ఇంతకుముందు బెదిరించాడని తెలిపారు. వారిని అరెస్టు చేయాలని డిమాండ్‌ చేశారు. (చదవండి: హేమంత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌!)
    
శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులకు ముగిసిన పోలీసు కస్టడీ
అమీర్‌పేట: టీవీ సీరియల్‌ నటి శ్రావణి ఆత్మహత్య కేసులో నిందితులైన దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిల పోలీసు కస్టడీ ముగిసింది. ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారాన్ని సేకరించేందుకు  చంచల్‌గూడ జైలులో ఉన్న దేవరాజ్‌రెడ్డి, సాయికృష్ణారెడ్డిలను ఎస్‌ఆర్‌నగర్‌ పోలీసులు మూడు రోజులు కస్టడీకి తీసుకున్నారు. కస్టడీ ముగియడంతో వారిని ఆదివారం తిరిగి జైలుకు తరలించారు. శ్రావణి ఆత్మహత్యకు ఒక రోజు ముందు ఏమి జరిగిందన్న దానిపై సుదీర్ఘంగా విచారించారు. పంజగుట్టలోని శ్రీకన్య హోటల్‌లో జరిగిన దాడిపై మరిన్ని వీడియో, ఆడియో సంభాషణలను  సేకరించినట్లు తెలిసింది.  మూడో నిందితుడిగా ఉన్న సినీ నిర్మాత అశోక్‌రెడ్డి సాయితో కలిసి ఆత్మహత్య జరిగిన రోజు రాత్రి శ్రావణి ఇంటికి వచ్చారని ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో  అశోక్‌రెడ్డిని కూడా  కస్టడీకి తీసుకుని విచారించనున్నట్లు సమాచారం. (దేవరాజ్‌తో వివాహం చేయండి : శ్రావణి)

మరిన్ని వార్తలు