చెరసాలలోకి మృగాలు.. ఏపీ అధికారిణిపై హైకోర్టు ప్రశంసలు

17 Nov, 2022 10:09 IST|Sakshi

ఇంకా పూర్తిగా ఊహ కూడా తెలియని వయస్సు.. సరదాగా తోటి స్నేహితులతో హాయిగా ఆడుకుంటూ కాలం గడపాల్సిన చిన్నారిని 12 ఏళ్ల ప్రాయంలోనే మాయమాటలు చెప్పి వ్యభిచార కూపంలోకి దించారు ఆ కిరాతకులు.. అంగట్లో వస్తువులా ఒకరి తర్వాత ఒకరు ఆ బాలిక విక్రయానికి తెగబడ్డారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలకూ తిప్పుతూ వ్యభిచారం చేయించారు.  ఈ వేధింపులు తాళలేక నరరూప రాక్షసుల నుంచి తప్పించుకున్న ఆ చిన్నారి ఎట్టకేలకు పోలీసులను ఆశ్రయించింది.  కేసును సీరియస్‌గా తీసుకున్న అప్పటి డీఎస్పీ, ప్రస్తుత అదనపు ఎస్పీ(అడ్మిన్‌) కె.సుప్రజ ఈ చిన్నారికి జరిగిన అన్యాయం మరొకరికి జరగకూడదనే ఉద్దేశంతో అపర కాళికలా మారారు. 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: కేసులో ఎంత పెద్దవారు ఉన్నా పోలీసులు ఒక్క అడుగు కూడా వెనక్కి వేయలేదు.  పది నెలల కాలంలో 79 మందిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. ఒక్కొక్కరికి 90 రోజుల నుంచి 120 రోజులపాటు రిమాండ్‌ విధించేలా చర్యలు చేపట్టారు. దీనిపై సుమారు 500 పేజీల ఛార్జ్ షీట్ను తయారు చేసి కోర్టుకు సమర్పించారు. నిందితులందరికీ శిక్ష పడటం ఖాయమని పోలీసులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. పోలీసుల పనితీరును హైకోర్టు సైతం ప్రశంసించింది.    

ఆదిశక్తిలా ఉరికిన ఏఎస్పీ సుప్రజ   
వ్యభిచారం చేయిస్తున్న నిర్వాహకుల నుంచి తప్పించుకున్న బాలిక మేడికొండూరు పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ చిన్నారి తనను తీసుకువెళ్లిన ప్రాంతాలన్నీ చెప్పినా అప్పటి స్టేషన్‌ అధికారులు స్పందించలేదు. దీంతో ఈ కేసును అప్పటి వెస్ట్‌ సబ్‌ డివిజన్‌ డీఎస్పీ, ప్రస్తుత గుంటూరు జిల్లా ఏఎస్పీ కె.సుప్రజకు ఉన్నతాధికారులు విచారణ బాధ్యతలు అప్పగించారు. కేసును క్షుణ్ణంగా పరిశీలించిన ఆమె చిన్నారితో ప్రత్యేకంగా మాట్లాడారు. కేసు మూలాల్లోకి వెళ్లారు. ఆదిశక్తి అవతారంలా ముందుకురికారు. ఐదు బృందాలను ఏర్పాటు చేసి, బాలిక చెప్పిన ప్రాంతాలన్నింటిలోనూ నిఘా ఏర్పాటు చేసి వ్యభిచార గృహాల నిర్వాహకులు, విటులను పట్టుకుని కటకటాల వెనక్కి నెట్టారు. డీఎస్పీ నుంచి ఏఎస్పీగా పదోన్నతి పొందిన తర్వాత కూడా ఈ కేసును పూర్తిస్థాయిలో సుప్రజ చేతే విచారణ చేయించాలని హైకోర్టు ఆదేశించటంతోపాటు, కేసు ఛేదనలో ప్రతిభ చాటిన ఆమెను న్యాయస్థానం 
అభినందించింది.

ఒక కేసు.. 80 మంది దోషులు 
గుంటూరు జిల్లా మేడికొండూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో గత ఏడాది 12 ఏళ్ల బాలికను అపహరించి, వ్యభిచార కూపంలోకి దించిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. బాలిక తల్లికి కోవిడ్‌ వచ్చి ఆస్పత్రిలో ఉన్న తరుణంలో తండ్రితో స్వర్ణ అనే మహిళ పరిచయం చేసుకుని బాలికను తనతో పంపిస్తే ఆమె బాగోగులు చూసుకుంటానని మాయమాటలు చెప్పింది. ఆ తర్వాత ఆమె మరొకరికి బాలికను విక్రయించింది. ఇలా బాలికను ఒకరి తర్వాత మరొకరు విక్రయిస్తూ చేతులు మార్చారు. వ్యభిచార కూపంలోకి దింపారు. తెలంగాణ, హైదరాబాద్, గుంటూరు, విజయవాడ, వైజాగ్, కాకినాడ, నెల్లూరు, తణుకు, రాజమండ్రి ప్రాంతాల్లో సుమారు 47 మంది వ్యభిచార గృహాల నిర్వాహకుల చేతుల్లో ఆ పసిమొగ్గ వాడిపోయింది. ఆఖరికి రాజస్థాన్‌–పాకిస్థాన్‌ బోర్డర్‌లో ఉన్న ఒక వ్యక్తి వద్ద నుంచి తప్పించుకున్న పాప ఎలాగో మేడికొండూరు చేరి పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసులో 80 మంది నిందితులుగా తేలారు. ఇప్పటికే 79 మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఒకరు మాత్రం లండన్‌లో ఉండటంతో పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీస్‌ (ఎల్‌ఓసీ) జారీ చేశారు. అతను ఎప్పుడు ఇండియాకి వచ్చినా అరెస్టు చేయడం ఖాయంగా కనిపిస్తోంది.   

న్యాయంతో కొంత ఉపశమనం 
సమాజంలో కొందరు మానవమృగాల్లా వ్యవహరిస్తున్నారు. చిన్నారులపై అకృత్యాలకు తెగబడుతున్నారు. ఇది ఎంతో బాధాకరం. వికృత చేష్టలకు పాల్పడేవారికి కఠిన శిక్షలు పడేలా చర్యలు తీసుకుంటున్నాం. కిరాతకులకు శిక్షలు వేయించినప్పుడు బాధిత చిన్నారులకు కొంతైనా న్యాయం చేయగలిగామన్న సంతోషం కలుగుతుంది. మేడికొండూరు కేసులోనూ సుమారు 10 నెలలు కష్టపడి చార్జిïÙటు దాఖలు చేశాం. ఆ బాలిక జీవితాన్ని నాశనం చేసిన ప్రతి ఒక్కరికీ కఠిన శిక్ష పడేలా చూస్తాం.  
– కె.సుప్రజ అడిషనల్‌ ఎస్పీ, గుంటూరు జిల్లా

పసిపాపలకు న్యాయం చేసి..  
సుప్రజ ఈస్ట్‌ డీఎస్పీగా పనిచేసిన సమయంలో కొత్తపేటలో ఐదేళ్ళ చిన్నారిపై లైంగిక దాడి చేసిన నిందితులు నేపాల్‌లో ఉంటే వారిని రప్పించి అరెస్టు చేయడంతోపాటు ప్రధాన నిందితునికి యావజ్జీవ కారాగార శిక్ష పడేలా చేశారు.   

లాలాపేటలో  రెండేళ్ల చిన్నారిపై 80 ఏళ్ల వ్యక్తి లైంగికదాడికి పాల్పడినప్పుడు కూడా విచారణ చేపట్టి అతనికి యావజ్జీవ శిక్ష పడేలా చేశారు.

మరిన్ని వార్తలు