సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకుంటారా ?

1 Jul, 2021 10:55 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌(భద్రాద్రి కొత్తగూడెం): ఓ సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకొని గిరిజనులను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించి తీవ్ర బెదిరింపులకు గురిచేసిన ములకలపల్లి ఎస్సైపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది సివిల్‌ వివాదమని ఎస్పీకి ఎస్సై ఒక వైపు నివేదిక ఇస్తూ.. మరోవైపు చట్టవిరుద్ధంగా పిటిషనర్‌ భర్త, మామలను ఎలా నిర్బంధించారని ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి, భద్రాద్రి ఎస్పీలను ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమకోహ్లీ, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం బుధవారం మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

తన భర్త, మామలను ములకలపల్లి ఎస్సై వేధింపులకు గురిచేశాడని, ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ ముల్కలపల్లి మండలం వేముగుంటకు చెందిన కొండూరు ఈశ్వరమ్మ గవర్నర్‌కు వినతిపత్రం సమర్పించింది. దీనిపై విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గవర్నర్‌ హైకోర్టుకు రాసిన లేఖను ధర్మాసనం గతంలో విచారణకు స్వీకరించింది. సీనియర్‌ న్యాయవాది డి.ప్రకాష్‌రెడ్డిని కోర్టు సహాయకారిగా (అమికస్‌క్యూరే) నియమించింది. ఈ పిటిషన్‌ మరోసారి విచారణకు వచ్చింది.

ఉదయం 8 నుంచి రాత్రి 9 గంటల వరకు పిటిషనర్‌ భర్త, మామలను పోలీస్‌స్టేషన్‌లో నిర్బంధించారని, పోలీసులు చెబుతున్న సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని ప్రకాష్‌రెడ్డి నివేదించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పోలీస్‌స్టేషన్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయలేదని తెలిపారు. తమకు వచ్చిన ఫిర్యాదుపై విచారణలో భాగంగా వారిని స్టేషన్‌కు పిలిపించారని, ఎస్సై ఎవరినీ బెదిరించలేదని హోంశాఖ తరఫున న్యాయవాది శ్రీకాంత్‌రెడ్డి నివేదించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ధర్మాసనం ఆదేశిస్తూ తదుపరి విచారణను సెప్టెంబర్‌ 1కి వాయిదా వేసింది. 

ఈశ్వరమ్మ ఏం రాసిందంటే...
‘వేముగంటలో మాకు 6 ఎకరాల భూమి ఉంది. పాల్వంచ రెవెన్యూ డివిజనల్‌ ఆఫీసర్‌ ముందు దాఖలు చేసిన కేసులో తీర్పు మాకు అనుకూలంగా వచ్చింది. అయినా మా ప్రత్యర్థులకు అనుకూలంగా ములకలపల్లి ఎస్సై నా భర్త, మామలను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించి ఉదయం నుంచి రాత్రి వరకు నిర్బంధించారు. అన్ని రెవెన్యూ రికార్డులు, కోర్టు తీర్పులను చూపించినా ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరించారు. తలకు గన్ను గురిపెట్టి ఆ భూమిపై హక్కులను వదులుకుంటున్నట్లు కొన్ని కాగితాలపై సంతకాలు తీసుకున్నారు. ఆ భూమిలోకి అడుగుపెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయంటూ హెచ్చరించారు. తమ ప్రత్యర్థులకు అనుకూలంగా వ్యవహరిస్తూ.. సివిల్‌ వివాదంలో జోక్యం చేసుకొని అక్రమంగా తన భర్త, మామను నిర్బంధించి వేధింపులకు గురిచేసిన ఎస్సైపై చర్యలు తీసుకోండి’అని ఈశ్వరమ్మ గవర్నర్‌కు రాసిన లేఖలో కోరింది.   

చదవండి: నేషనల్‌ డాక్టర్స్‌ డే: థ్యాంక్యూ డాక్టర్‌ గారూ..

మరిన్ని వార్తలు