వాడుకొని.. వదిలేశాడంటూ హిజ్రా హల్‌చల్‌

4 Apr, 2021 10:42 IST|Sakshi

కుషాయిగూడ: పెళ్లి చేసుకొని తనను అన్ని విధాలా వాడుకొని ముఖం చాటేస్తున్నాడంటూ ఓ హిజ్రా శనివారం కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతడిపై కేసు నమోదు చేసి న్యాయం చేయాలంటూ హల్‌చల్‌ చేసింది. వివరాలివీ... మల్లాపూర్‌ నెహ్రూనగర్‌కు చెందిన దివ్య అనే హిజ్రాతో మెహిదీపట్నం, మల్లేపల్లికి చెందిన నాగేందర్‌ అనే యువకుడికి పరిచయం ఏర్పడింది. తరచు జాతరలు వెళ్తున్న క్రమంలో నాగేందర్‌కు తారసపడ్డ దివ్యతో పరిచయం పెంచుకొని కొన్ని రోజులు స్నేహం చేశాడు. వారితో తిరుగుతూ మద్యం తాగుతూ సరదాగా గడపడానికి అలవాటుపడ్డాడు.

ఈ క్రమంలో వారి మధ్య ప్రేమ చిగురించి 2019 నవంబర్‌లో వివాహం చేసుకున్నారు. అప్పటి నుంచి వారితోనే ఉంటున్నాడు. కుటుంబ సభ్యులను కలిసేందుకు అప్పుడప్పుడు వెళ్లి వచ్చేవాడు. గడిచిన ఏడాదిన్నరగా నాగేందర్‌ ఖర్చులతో పాటుగా అతడి ఇంటి పోషణకు కావాల్సిన డబ్బులు కూడా తానే ఇచ్చానని దివ్య చెబుతోంది. తీరా మరో అమ్మాయి మోజులో పడి నన్ను వదిలించుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాడని నాకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై కుషాయిగూడ ఇన్‌స్పెక్టర్‌ మన్మోహన్‌ను వివరణ కోరగా ఫిర్యాదు వచ్చింది వాస్తవమేనన్నారు. ఇరువురితో మాట్లాడి మొదట కౌన్సిలింగ్‌ ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. 
( చదవండి: ప్రేమ పేరుతో మోసం; యువతిని లైంగికంగా వాడుకొని.. )

మరిన్ని వార్తలు