Hijra Fight: సినిమాను తలపించే రీతిలో.. హిజ్రాల గ్యాంగ్‌వార్‌

30 Jul, 2021 15:44 IST|Sakshi
ఆందోళనకు దిగిన హిజ్రాలతో మాట్లాడుతున్న పోలీసులు

ప్రాంతాల వారీగా విడిపోయి ఒకరిపై ఒకరి దాడి

కలెక్టరేట్‌ ఎదుట ఆందోళన  

అనంతపురం క్రైం: హిజ్రాలు రెడ్డెక్కారు. ఆధిపత్య పోరులో ప్రాంతాల వారీగా విడిపోయి దాడులకు తెగబడ్డారు. ఇందులో అనంతపురానికి చెందిన ఒకరు తీవ్రంగా గాయపడగా... దాడి చేసిన వారిని అరెస్టు చేయాలంటూ గురువారం కలెక్టరేట్‌ వద్ద హిజ్రాలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. టూటౌన్‌ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ తెలిపిన వివరాల మేరకు.. అనంతపురంలోని జయమణెమ్మ కళ్యాణమంటపంలో మన విజయం ట్రాన్స్‌జెండర్‌ అసోసియేషన్‌ మయూరి ఆధ్వర్యంలో ఈ నెల 28న హిజ్రాలు ఉలిగమ్మ ఉత్సవం నిర్వహించారు. వైఎస్సార్‌ కడప, కర్నూలు, చిత్తూరు, నెల్లూరు, బళ్లారి ప్రాంతాల నుంచి దాదాపు 500 మంది హిజ్రా లతో పాటు హైదరాబాద్, కర్ణాటక నుంచి 120 మంది హాజరయ్యారు.

హైదరాబాద్‌కు చెందిన సునితా నాయక్‌ అలియాస్‌ అక్తార్‌భాను ఆధ్వర్యంలో నడిచే సంఘానికి ఇకపై డబ్బులు చెల్లించకూడదని కర్ణాటక, ఏపీకి చెందిన హిజ్రాలు నిర్ణయించగా, హైదరాబాద్‌ హిజ్రాలు అభ్యంతరం తెలిపారు. ఈ క్రమంలోనే మాటామాట పెరగడంతో వాదన చేసుకున్నారు. ఉత్సవం అనంతరం తమ స్వస్థలాలకు వెళ్లేందుకు హైదరాబాద్, కర్ణాటకకు చెందిన ఆశా, వీనా, ఆర్థన, గీతమ్మ తదితరులు అర్ధరాత్రి వేళ అనంతపురం శివారులోని తపోవనం వద్దకు చేరుకున్నారు.

అక్కడ కొద్దిసేపు వాదులాట జరగ్గా... అనంతపురం హిజ్రా రుక్సానా అలియాస్‌ శర్మాస్‌పై వారంతా దాడి చేశారు. దీనికి నిరసనగా గురువారం కలెక్టరేట్‌ ముందు పలువురు హిజ్రాలు ఆందోళన చేపట్టారు. బంగారం, డబ్బులు లాక్కున్నారని, దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. వన్‌టౌన్‌ సీఐ ప్రతాప్‌ రెడ్డి, టూటౌన్‌ సీఐ జాకీర్‌ హుస్సేన్‌ హిజ్రాలతో మాట్లాడి ఆందోళనను విరమింపజేశారు. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. ఆధిపత్య పోరుతోనే సమస్య తలెత్తిందని, విచారణ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు.   

మరిన్ని వార్తలు