హిజ్రాలను టార్గెట్‌ చేసిన 10 మంది యువకులు.. నిందితులను పట్టిస్తే వదిలేస్తారా అంటూ..

18 Sep, 2022 15:34 IST|Sakshi
పోలీస్‌ స్టేషన్‌లో బైఠాయించిన హిజ్రాలు 

తాళ్లరేవు(తూర్పుగోదావరి): యానాంలో తమపై దాడికి పాల్పడడంతో పాటు చంపుతామని బెదిరించిన యువకులను అరెస్ట్‌ చేసి కఠినంగా శిక్షించాలని కోరుతూ హిజ్రాలు శనివారం కోరంగి పోలీస్‌ స్టేషన్‌ను ముట్టడించారు. సుమారు 100 మందికి పైగా హిజ్రాలు జాతీయ రహదారి 216లో పోలీస్‌ స్టేషన్‌ ఎదుట బైఠాయించారు. సుమారు అరగంట పాటు ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. అనంతరం తాము పట్టి ఇచ్చిన నిందితులను వదిలేస్తారా అంటూ పోలీస్‌ స్టేషన్‌లోకి చొచ్చుకెళ్లారు. స్టేషన్‌లోకి ఎవరినీ వెళ్లనీయకుండా అడ్డంగా కూర్చోవడంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.
చదవండి: వేరే మహిళలతో భర్త వివాహేతర సంబంధం.. భార్య షాకింగ్‌ నిర్ణయం 

ఎస్సై టి.శివకుమార్‌ ముగ్గురు యువకులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో హిజ్రాలు శాంతించారు. అయితే కేసు నమోదు చేసేవరకూ ఇక్కడి నుంచి వెళ్లేది లేదని చెప్పడంతో అదనపు బలగాలను రప్పించారు. ఈ సందర్భంగా బాధిత హిజ్రాలు ఐశ్వర్య, లిథియా తదితరులు విలేకర్లతో మాట్లాడుతూ పొట్టకూటి కోసం యానాం ప్రాంతంలో సంచరిస్తున్న తమపై పది మంది యువకులు మూడు నెలలుగా మానసికంగా, శారీరకంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నారు.

ఆపరేషన్‌ చేయించుకున్న ఒకామెపై ముగ్గురు యువకులు లైంగిక దాడికి పాల్పడేందుకు ప్రయత్నించగా అడ్డుకున్నందుకు కర్రలు, కత్తులతో దాడిచేసి గాయపరచడంతో పాటు తమ వద్ద సెల్‌ఫోన్లు, మనీపర్స్‌లు కూడా లాక్కుని వెళ్లారని ఆరోపించారు. హిజ్రాలపై దాడికి పాల్పడిన కేసుకు సంబంధించి యానాంకు చెందిన కొల్లు మరిడయ్య, ఆకుల సాయిప్రసాద్, మొగలి నానిలపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై శివకుమార్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు