తెల్లారిన బతుకులు.. వలస కార్మికులపై నుంచి దూసుకెళ్లిన ఇన్నోవా.. ఐదుగురు అక్కడికక్కడే..

7 Mar, 2023 15:42 IST|Sakshi

శిమ్లా: హిమాచల్‌ప్రదేశ్‌ సోలన్ జిల్లా ధరంపూర్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చండీగఢ్-శిమ్లా జాతీయ రహదారిపై టొయోటా ఇన్నోవా కారు వలస కార్మికులపైనుంచి దూసుకెళ్లింది.  ఈ ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానికులు ఆస్పత్రికి తరలించారు.

వీరంతా పనికోసం వెళ్తున్న సమయంలో  సోలన్‌ నుంచి పర్వాను వెళ్తున్న వాహనం వాళ్లను ఢీకొట్టినట్లు అధికారులు తెలిపారు. స్థానికులే పోలీసులకు సమాచారం అందించి, అంబులెన్స్‌కు కాల్ చేసినట్లు పేర్కొన్నారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు కార్మికులను ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. 

మృతుల్లో ముగ్గురు.. గుడ్డుయాదవ్, రాజా వర్మ, నిప్పు నిషద్ బిహార్ చంపారన్ జిల్లాకు చెందిన వారు. మోతి లాల్‌ యాదవ్, సన్నీ దేవల్ యూపీలోని కుషీనగర్‌ జిల్లాకు చెందిన కార్మికులు. 

ఘటన అనంతరం ఇన్నోవా డ్రైవర్‌ రాజేష్‌ను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష‍్యంగా, రాష్ డ్రైవింగ్ చేసి ఐదుగురు కార్మికుల మరణానికి కారణమైన అతనిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు చెప్పారు.
చదవండి: ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో మరో అరెస్ట్‌.. పదకొండుకు చేరిన సంఖ్య

మరిన్ని వార్తలు