హైటెక్‌ వ్యభిచారం: వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలతో వలపువల

25 Jul, 2021 07:58 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, కరీంనగర్‌: లగ్జరీ ఇళ్లు.. సంపన్నులు ఉండే ప్రాంతాలు.. శివారుకాలనీలు అడ్డాగా కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో అనుమానం రాకుండా హైటెక్‌ వ్యభిచారం సాగుతోంది. యువకులు, సంపన్నులు, పేరున్న వారితో ఆన్‌లైన్‌లో చాటింగ్‌ చేస్తూ.. వాట్సాప్‌లో అందమైన అమ్మాయిల ఫొటోలు పంపిస్తూ.. వలపువల వేస్తున్నారు. రేట్‌ ఫిక్స్‌ చేసుకుని దందాను గుట్టుగా సాగిస్తున్నారు. ఇటీవల నిఘా పెట్టిన పోలీసులు పలు ప్రాంతాల్లో దాడులు చేశారు. పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తుండగా.. విస్తుపోయే నిజాలు వెలుగుచూస్తున్నాయి.

అంతా వాట్సాప్‌లోనే..
వ్యభిచార కేంద్రం నిర్వాహకులు కస్టమర్లతో ప్రత్యేకంగా వాట్సాప్‌ గ్రూపులు ఏర్పాటు చేస్తున్నారు. సదరు గ్రూపుల్లో యువతుల ఫొటోలు పెడుతూ ఆకర్షిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా కొందరు దంపతులు కలసి ఈ దందాను సైలెంట్‌గా నడిపిస్తున్నారు.
► ఎక్కువగా యువత, ఇంజినీరింగ్, పీజీ కళాశాలలకు చెందిన విద్యార్థులకు వలపువల విసురుతూ.. తమ మనిషిని పంపించి పరిచయాలు పెంచుకొని దందాకు శ్రీకారం చుడుతున్నారు.
► జిల్లాలోని ప్రముఖులు, రాజకీయ నాయకులు, బడా వ్యాపారులు, వివిధ ప్రభుత్వశాఖల ఉద్యోగులు, పేరున్న పెద్దమనుషులు, విద్యాసంస్థల కరస్పాండెంట్ల వద్దకు యువతులనే నేరుగా పంపిస్తున్నారని సమాచారం.
నగరశివారు ప్రాంతాల్లో అయితే ఎక్కువగా జనాలు వచ్చిపోవడం చూసి చుట్టుపక్కలవారు పోలీసులకు సమాచారమందిస్తున్నారని జిల్లాకేంద్రంలోనే కొత్తదారులు వెతుకుతున్నారు. నగరంలోని మంకమ్మతోట, జ్యోతినగర్, భాగ్యనగర్, తీగలగుట్టపల్లి, విద్యానగర్, భాగ్యనగర్, చైతన్యపురి, బ్యాంక్‌కాలనీల్లో పెద్దపెద్ద అపార్ట్‌మెంట్లను అద్దెకు తీసుకొని గుట్టుగా దందా నడిపిస్తున్నారు.
► అదే విధంగా కరీంనగర్‌లోని కొన్ని లాడ్జీల్లోనూ విచ్చలవిడగా వ్యభిచారం జరుగుతోందని అరోపణలున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల నుంచి యువతులను తీసుకొచ్చి అద్దె ఇళ్లు, ప్లాట్లలో వ్యభిచారం నడిపిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది.
► ఫోన్‌ల ద్వారానే యువతుల ఎంపిక, బేరం అన్ని జరుగుతుంటాయని తెలిసింది. కొందరు ఉన్నత చదువులు చదివిన యువతులు కూడా తమ  ఆర్థిక పరిస్థితుల కారణంగా రొంపిలోకి దిగుతుండడం బాధాకరమైన విషయమని ఓ పోలీసు అధికారి తెలిపారు.

పోలీసుల నిఘా 
వ్యభిచార ముఠా గుట్టురట్టు చేసేందుకు పోలీసులు ప్రత్యేక నిఘాపెట్టారు. కరీంనగర్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గత నెలలో టూటౌన్‌ పరిధిలోని సప్తగిరికాలనీలోని ఓ ఇంట్లో దాడిచేసి వ్యభిచార నిర్వాహకులైన భార్యభర్తలు, ముగ్గురు విఠులను అరెస్టు చేశారు. వారినుంచి రూ.37,380 స్వాధీనం చేసుకున్నారు. ఈ నెల 15న కరీంనగర్‌ రూరల్‌ ప్రాంతంతోని తీగలగుట్టపల్లిలో ఒక వ్యభిచార గృహంపై దాడి చేశారు. నిర్వాహకుడితో పాటు విఠుడిని అరెస్టు చేశారు. దందాపై పోలీసులు నిఘా పెడుతూ అరెస్టు చేస్తున్నప్పటికీ ఎక్కడోఒకచోట గుట్టుగా నడుస్తూనే ఉంది. ప్రజలు చుట్టుపక్కల ప్రాంతాల్లో చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగితే డయల్‌ 100 ద్వారా, సమీప పోలీస్‌స్టేషన్‌కు సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు. 

వేళ్లూనుకుంటున్న దందా..
కరీంనగర్‌ జిల్లాకేంద్రంలో వ్యభిచార దందా వేళ్ళూనుకుంటోంది. నగరం నడిబొడ్డున వ్యభిచార కేంద్రాలు వెలుస్తుండగా.. గుట్టుచప్పుడు కాకుండా దందా కొనసాగిస్తున్నారు. వివిధ ప్రాంతాల నుంచి యువతులను రప్పించి వారి అర్థిక స్థితిగతులను ఆసరాగా చేసుకుని రొంపిలోకి దింపుతున్నారు. పోలీసులు దాడులు చేసినప్పటికీ.. దందా ఆగడం లేదు. గతంలో చింతకుంట, రేకుర్తి, హౌసింగ్‌బోర్డుకాలనీ శివారు ప్రాంతాల్లో జరిగే వ్యభిచారం ఇప్పుడు జిల్లాకేంద్రంలోనే హైటెక్‌ హంగులతో కొనసాగిస్తూ.. పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇటీవల కాలంలో జిల్లా కేంద్రంలోనే రెండు వ్యభిచార కేంద్రాలపై పోలీసులు దాడిచేసి నిర్వాహకులు, విటులను అరెస్టు చేశారు. 

మరిన్ని వార్తలు