భర్తే కాలయముడైన వేళ.. 

30 Jul, 2020 10:17 IST|Sakshi
జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న శివజ్యోతి 

భార్య ఆత్యహత్యాయత్నం 

వేధింపులే కారణం 

హోంగార్డ్‌ అకృత్యం 

తూర్పుగోదావరి,కాకినాడ క్రైం: ఓ హోంగార్డు వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. బాధితురాలు, పోలీసుల కథనం మేరకు... కాకినాడ డెయిరీ ఫారం కూడలి సత్యానగర్‌కి చెందిన చెల్లవరపు శివజ్యోతికి ఏడేళ్ల క్రితం విజయనగరానికి చెందిన చెల్లవరపు స్వామినాయుడుతో వివాహమైంది.  స్వామినాయుడు వృత్తి రీత్యా హోంగార్డు. హైదరాబాద్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. వివాహానంతరం శివజ్యోతి భర్తతో కలిసి హైదరాబాద్‌ వెళ్లిపోయింది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. అయితే వివాహమైన తొలినాళ్ల నుంచి స్వామినాయుడు భార్య శివజ్యోతిని మానసికంగా, శారీరకంగా వేధించేవాడు. అనుమానం నెపంతో పలుమార్లు దాడికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులతో మాట్లాడవద్దనేవాడు.

భార్య ను తీవ్రంగా కొట్టేవాడు. ఒకరోజు తక్షణమే పుట్టింటికి వెళ్లిపోమ్మని పోషణ నిమిత్తమయ్యే ఖర్చు పంపిస్తానని చెప్పి స్వామినాయుడు ఆమె పిల్లలిద్దరితో కలిసి ఏడాది క్రితం కాకినాడలోని పుట్టింటికి పంపేశాడు. నాటి నుంచి పుట్టింట్లో ఉంటున్న శివజ్యోతికి భర్త చిల్లిగవ్వైనా పంపకపోవడంతో స్థానికంగా ఓ పాఠశాలలో టీచరుగా పనిచేస్తూ పిల్లల్ని పోషించుకుంటూ తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఆ ఉద్యోగమూ పోయింది. నాటి నుంచి శివజ్యోతి కష్టాలు రెట్టింపయ్యాయి. మెకానిక్‌ అయిన తండ్రి సంపాదనతోనే అంతంత మాత్రంగా జీవనం కొనసాగిస్తోంది. ఇదిలా ఉంటే ఏడాది తర్వాత స్వామినాయుడు మంగళవారం హైదరాబాద్‌ నుంచి కాకినాడ అత్త ఇంటికి వచ్చాడు.  

ఏడాదిగా తాము పడిన కష్టాలు చెప్పుకొని భార్య, బిడ్డలని పోషించే బాధ్యత లేదా అని భర్తని నిలదీసింది. ఇదే విషయంపై ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. భార్యకి సమాధానం చెప్పలేక స్వామినాయుడు ఆమెని విచక్షణా రహితంగా కొట్టాడు. ముఖం, మెడ భాగాలపై గోళ్లతో రక్కాడు. భర్త హింస భరించలేక శివజ్యోతి ఇంట్లో ఉన్న ఫ్లోర్‌క్లీనర్‌ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించింది. అది గమనించిన కుటుంబ సభ్యులు ఆమెని కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆసుపత్రి(జీజీహెచ్‌)కి తరలించారు. బాధితురాలికివైద్యం అందించామని చెప్పిన వైద్యులు ఆమె ఆరోగ్యంపై పర్యవేక్షణ కొనసాగుతోందన్నారు. ఈ ఘటనపై కాకినాడ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. 

మరిన్ని వార్తలు