పని చేస్తున్న ఇంటికే కన్నం..

12 Aug, 2020 08:10 IST|Sakshi
నిందితురాలు మేరీ

మహిళ అరెస్టు... సొత్తు స్వాధీనం 

కేపీహెచ్‌బీ కాలనీ: తాను పని చేస్తున్న ఇంటికే కన్నం వేసిందో మహిళ.  నగదుతో పాటు బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లింది. చివరకు పోలీసులకు చిక్కి కటకటాల పాలైంది.  మంగళవారం సీఐ లక్ష్మీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం...  కేపీహెచ్‌బీ కాలనీలోని ఇందూ ఫారŠూచ్యన్‌ ఫీల్డ్స్‌లో నివాసం ఉండే శ్రీకాంత్‌ రెడ్డి ఇంట్లో గుంటూరు జిల్లాకు చెందిన మాచర్ల మేరీ (40) పని చేస్తూ అక్కడే సర్వెంట్‌ క్వార్టర్‌లో ఉంటోంది. కొద్ది రోజులుగా ఓ బాలిక కూడా ఈమెతో పాటు పని చేస్తూ అదే క్వార్టర్‌లో ఉంటోంది. శ్రీకాంత్‌రెడ్డి వ్యాపారంలో వచ్చిన డబ్బును బెడ్‌రూంలోని కబోర్డులో దాచి పెట్టడం చూసిన వీరు పలుమార్లు కొద్ది కొద్దిగా మొత్తం రూ. 5 లక్షలు దొంగిలించారు.

అంతేకాకుండా బంగారు గాజులు, రెండు బంగారు రింగులను కూడా అపహరించారు.  దొంగిలించిన డబ్బుతో కొంత బంగారాన్ని కొనుగోలు చేశారు. అయితే బంగారు ఆభరణాలు పోయిన విషయమై మూడు రోజుల క్రితం శ్రీకాంత్‌రెడ్డి పని మనిషిని  ప్రశ్నించగా తాను తీయలేదని చెప్పింది. అంతేకాకుండా సర్వెంట్‌ క్వార్టర్‌ ఖాళీ చేసి వెళ్లిపోయింది.దీంతో అనుమానం వచ్చిన ఇంటి యజమాని సోమవారం కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పనిమనిషి మేరీని విచారించగా నేరం చేసినట్టు అంగీకరించింది. ఆమె వద్ద నుంచి రూ. 1.7 లక్షల నగదు, 59 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. మేరీతో పాటు పని చేసిన మరో బాలికకు జువైనల్‌ చట్టం కింద నోటీసులు జారీ చేసి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ  తెలిపారు. 

మరిన్ని వార్తలు