హార్స్‌ రేస్‌లో కిందపడి జాకీ మృతి 

3 Jan, 2021 19:47 IST|Sakshi

మలక్‌పేట రేస్‌కోర్స్‌లో ఘటన

సాక్షి, హైదరాబాద్‌/చాదర్‌ఘాట్‌: మలక్‌పేట్‌లోని హైదరాబాద్‌ రేస్‌ క్లబ్‌లో (హెచ్‌ఆర్సీ) మరో విషాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం ఉస్మాన్‌సాగర్‌ ప్లేట్‌ డివిజన్‌–2 రేసులో పాల్గొన్న రాజస్తాన్‌కు చెందిన జాకీ జితేందర్‌ సింగ్‌ (25) గోల్డెన్‌ టేబుల్‌ అనే గుర్రం పైనుంచి పడి ప్రాణం విడిచాడు. హెచ్‌ఆర్సీలో జరిగే వివిధ రేసుల్లో ఇక్కడి గుర్రాలు స్వారీ చేయడం కోసం దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జాకీలు వస్తుంటారు. ఈ నేపథ్యంలోనే రెండ్రోజుల క్రితం జితేందర్‌ సింగ్‌ నగరానికి చేరుకున్నారు. క్లబ్‌ ప్రాంగణంలో ఉన్న హెచ్‌ఆర్సీ గెస్ట్‌ హౌస్‌లో బస చేశారు. ఈ రేసులో మొత్తం పది మంది పాల్గొన్నారు.

మూడో స్థానంలో జితేందర్‌ సింగ్‌ ఉన్నారు. రేసు మొదలైన కాసేపటికే గుర్రం 50 కి.మీ. వేగం అందుకుంది. ఎమైందో కానీ ఒక్కసారిగా గుర్రంతో పాటు జితేందర్‌ సింగ్‌ పడిపోయాడు. ఈ నేపథ్యంలోనే గుర్రం కాలు ఆయన ఛాతీ భాగంలో బలంగా తగలడంతో అక్కడికక్కడే కుప్పకూలాడు. వెంటనే అప్రమత్తమైన హెచ్‌ఆర్సీ వర్గాలు ఆయన్ను మలక్‌పేటలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించాయి. అయితే అప్పటికే ఆయన చనిపోయినట్లు వైద్యులు చెప్పడంతో పోస్టుమార్టం పరీక్షల నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. దీనిపై చాదర్‌ఘాట్‌ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఉదంతానికి సంబంధించిన సీసీ కెమెరా ఫీడ్‌ను సేకరించిన పోలీసులు విశ్లేషిస్తున్నారు.  చదవండి: (చేయని నేరానికి బలైపోతున్నా..)

గతంలోనూ ముగ్గురు: 
►2005 నవంబర్‌ 28న మెదక్‌ ప్లేట్‌ డివిజన్‌–1 రేసులో ‘గ్రీకువీరుడు’అనే గుర్రం పైనుంచి పడి హైదరాబాద్‌కు చెందిన జాకీ మధుకుమార్‌ చనిపోయాడు. 
►2012 అక్టోబర్‌ 19న ఎలైజ్‌ జోన్‌ ప్లేట్‌ చేజింగ్‌లో ‘ట్రిపుల్‌ ఎయిట్‌’అనే గుర్రం పైనుంచి పడి పుణేకు చెందిన లక్ష్మణ్‌ అనే జాకీ మరణించాడు. 
►2014 ఏప్రిల్‌ 17న ఎలైట్‌ జోన్‌ రేసులో మూడు గుర్రాలు ఒకదాన్ని ఒకటి గుద్దుకోవడంతో జాకీలతో సహా పడిపోయాయి. ఈ నేపథ్యంలోనే పుణేకు చెందిన జాకీ శ్యామలరావు చనిపోయాడు.

మరిన్ని వార్తలు