పని మనిషిని ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా...

7 Mar, 2021 11:43 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

బంజారాహిల్స్‌: ఇంట్లో పని కోసం కుదుర్చుకున్న పని మనిషిపై ఇంటి యజమాని ఫ్లాట్‌లో బంధించి రెండు వారాలుగా లైంగిక దాడికి పాల్పడుతున్న ఘటన బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. బాధితురాలు చాకచక్యంగా నిందితుడి నుంచి తన ఫోన్‌ను లాక్కొని కూతురికి ఫోన్‌ చేయడంతో ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. ఫిలింనగర్‌ సమీపంలోని ఓ అపార్ట్‌మెంట్‌లోని ఫ్లాట్‌ నంబర్‌.1905లో ఉదయ భాను(52) అనే వ్యాపారి నివసిస్తున్నాడు. సినిమా పరిశ్రమలో పని చేస్తున్న ఇతడు గత నెల 17వ తేదీన రాజమండ్రి నుంచి ఓ పని మనిషిని రప్పించుకున్నాడు. ఆమెకు అదే అపార్ట్‌మెంట్‌లో చిన్న గదిని కేటాయించారు.

కాగా, అదే నెల 18వ తేదీన ఆమె పని చేస్తుండగా బలవంతంగా తన గదిలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం బయటికి పొక్కితే నిన్ను, నీ కూతురును చంపేస్తానంటూ బెదిరించాడు. అంతే కాదు ఆమె సెల్‌ఫోన్‌ కూడా తన వద్దే పెట్టుకున్నాడు. ఆ రోజు నుంచి ఆమెను బెదిరిస్తూ లైంగికదాడికి పాల్పడటమే కాకుండా గదిలో బంధించి బయటి నుంచి తాళం వేసి వెళ్తున్నాడు. ఈ విషయాన్ని ఆమె కూతురికి చెప్పడానికి కూడా వీల్లేకుండా పోయింది. ఈ నెల 5వ తేదీన నిందితుడు ఉదయ భాను బయటికి వెళ్తున్న సమయంలో చాకచక్యంగా ఆమె తన సెల్‌ఫోన్‌ను తీసుకొని కూతురికి జరిగిన విషయం చెప్పింది. ఆందోళన చెందిన కూతురు 100కు ఫోన్‌ చేసింది.

పోలీసులు వెంటనే సెల్‌సిగ్నల్‌ ఆధారంగా కేసును ఛేదించి ఫిలింనగర్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉన్నట్లు గుర్తించారు. శుక్రవారం రాత్రి 10 గంటల సమయంలో ఎస్‌ఐ రాంబాబు సిబ్బందితో కలిసి అపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి ఫ్లాట్‌లో బంధించిన బాధితురాలికి విముక్తి కలిగించి ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఉదయ భానుపై ఐపీసీ సెక్షన్‌–342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

చదవండి: భార్య నోట్లో పురుగుల మందు కలిపిన కూల్‌డ్రింక్‌ పోసి

మరిన్ని వార్తలు