ఇళ్లు కూలి ముగ్గురు మృతి

17 Sep, 2020 12:32 IST|Sakshi
మట్టిని తొలగించి బాలుడిని బయటికి తీస్తున్న స్థానికులు

మరికల్‌ (నారాయణపేట): మండలంలోని కన్మనూర్‌కు చెందిన అనంతమ్మ (68) ఇంటి గోడ కూలి మరణించింది. మధ్యాహ్నం 12గంటలకు భోజనం చేసిన అనంతరం ఇంటిముందు ఉన్న శిథిలావస్థకు చేరిన గోడ సమీపంలో కూర్చొంది. అకస్మాత్తుగా గోడ కూలడంతో వృద్ధురాలు దుర్మరణం చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతురాలికి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ నాసర్‌ తెలిపారు.  

కుడికిళ్లలో.. 
కొల్లాపూర్‌ రూరల్‌: మండలంలోని కుడికిళ్లకు చెందిన సంకె దేవమ్మ(65) మంగళవారం అర్ధరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా మట్టి మిద్దె కూలి మరణించింది. భారీగా వర్షం కురిసే సమయంలో ఈ ఘటన జరిగినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆమెకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు ఎల్లేని సుధాకర్‌రావు సంఘటనా స్థలానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.  

ధన్వాడ: మండలకేంద్రంలోని ఎస్సీ కాలనీకి చెందిన గ్రామ పంచాయతీ పారుశుద్ధ్య కార్మికుడు తిరుమలేష్‌ పెద్ద కుమారుడు గౌతం(3) బుధవారం మట్టి మిద్దె కూలి అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉదయం 11గంటలకు వర్షం తగ్గడంతో పిల్లాడి తల్లి పల్లవి  గౌతంకు అన్నం తినిపించి వంట రూంలోని మంచంపై పడుకోపెట్టి బట్టలు ఉతికేందుకు బయటకు వచ్చింది. 5నిమిషాలకే మిద్దెకూలి భారీ శబ్ధం రావడంతో అక్కడే ఉన్న తిరుమలేష్‌తో పాటు చుట్టు పక్కలవారు వచ్చి మట్టిని తొలగించి చిన్నారిని బయటకు తీశారు. వెంటనే జిల్లాకేంద్రంలోని ఆస్పత్రికి తరలించారు. వైద్యులు చిన్నారిని పరీక్షించి అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించడంతో తల్లితండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ విషయం తెలుసుకున్న తహసీల్దార్, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. గ్రామంలో మట్టి మిద్దెలు ఉన్న వారు జాగ్రత్తగా ఉండాలని చాటింపు వేయించారు.  

మూడేళ్లకే నూరేళ్లు నిండాయ్‌..
మంగళవారం రాత్రి మూడోఏట పుట్టినరోజు వేడుకలు జరుపుకున్నాడు. ఉదయం చుట్టుపక్కల పిల్లలతో సరదాగా ఆడుకున్నాడు. ఈ సమయంలో అమ్మచేతి గోరు ముద్దలు తిన్నాడు. నిద్ర వస్తుందనో లేక మృత్యువు పిలిచిందో తెలియదు కాని ఇంట్లోకి వెళ్లాడు. పిల్లాడిని చూసిన అమ్మ దగ్గరికి పిలుచుకుని మంచంపై పడుకోబెట్టి బయటకు పనులు చూసుకునేందుకు వెళ్లింది. బయటకు వెళ్లినా నిమిషాల్లో మట్టి మిద్దె ఉన్నపాటుగా కుప్పకూలింది. ఈ హృదయ విషాదకర ఘటన గ్రామస్తులను కలిచివేసింది.  

>
మరిన్ని వార్తలు