Delhi Fire Accident: ఢిల్లీ ప్రమాదంలో 29 మంది గల్లంతు

15 May, 2022 07:34 IST|Sakshi
ఘటనాస్థలిలో గుమికూడిన జనం. (ఇన్‌సెట్లో) రోదిస్తున్న మృతుని బంధువు

బయటపడుతున్న మృతదేహాల భాగాలు

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షలు ప్రకటించిన కేజ్రీవాల్‌

న్యూఢిల్లీ: ఢిల్లీలోని ముండ్కా ప్రాంతంలో శుక్రవారం సంభవించిన ఘోర అగ్నిప్రమాద ఘటనలో 29 మంది గల్లంతైనట్లు అధికారులు తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన 27 మందిలో ఏడుగురిని ఇప్పటివరకు గుర్తించారు. మంటలను ఆర్పిన అనంతరం శనివారం ఉదయం భవనంలో మాడిమసైన మృతదేహ భాగాలను ఫోరెన్సిక్‌ నిపుణులు సేకరించారు. దీంతో, మృతుల సంఖ్య 30కు చేరే అవకాశం ఉందని భావిస్తున్నారు. క్షతగాత్రులైన మరో 12 మంది ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

భవనంలో పూర్తి స్థాయి గాలింపు కొనసాగుతోందని అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో ఆ భవనంలోకి వేర్వేరు పనుల నిమిత్తం వచ్చి గల్లంతైనట్లు భావిస్తున్న 29 మంది ఆచూకీ కోసం వారి కుటుంబీకులు ఆందోళన చెందుతున్నారు. పూర్తిగా కాలిన స్థితిలో ఉన్న మృతదేహాల గుర్తింపు సాధ్యంకాని సందర్భాల్లో డీఎన్‌ఏ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు తెలిపారు. మిస్సయిన 24 మంది మహిళలు సహా మొత్తం 29 మంది జాబితాను పోలీసులు తయారు చేశారు.

కాగా, ప్రమాదం చోటుచేసుకున్న నాలుగంతస్తుల భవనానికి ఫైర్‌ సేఫ్టీ సర్టిఫికెట్‌ లేదు. భవనం మొత్తానికి ఒకే గేట్‌ ఉన్న కారణంగా మరణాలు పెరిగాయని చీఫ్‌ ఫైర్‌ ఆఫీసర్‌ అతుల్‌ గార్గ్‌ వెల్లడించారు. ఏసీ యంత్రం పేలుడు కారణంగానే మంటలు చెలరేగినట్లు అనుమానిస్తున్నామన్నారు. అయితే, ఒకటో అంతస్తులోని సీసీటీవీ కెమెరా ఉత్పత్తి యూనిట్‌లో మంటలు మొదలయ్యాయనే అనుమానంతో ఆ యూనిట్‌ యజమానులైన హరీశ్‌ గోయెల్, వరుణ్‌ గోయెల్‌ను అదుపులోకి తీసుకున్నట్లు డీసీపీ సమీర్‌ శర్మ తెలిపారు.

భవనంలోని నాలుగంతస్తులను వీరి కంపెనీయే వాడుకుంటోందని, వివిధ సెక్షన్ల కింద కేసులు పెట్టామని అన్నారు. భవన యజమాని మనీశ్‌ లక్రాపైనే కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు. కాగా, ప్రమాద ఘటనపై మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు ఆదేశించినట్లు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ చెప్పారు. శనివారం ఆయన ఘటనాస్థలిని పరిశీలించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50వేల చొప్పున అందజేస్తామన్నారు. 

మరిన్ని వార్తలు