సిగ్నల్‌ జంపింగ్‌.. ప్రాణాలు తీసింది

14 Dec, 2020 04:36 IST|Sakshi

సైబరాబాద్‌ ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఘోర ప్రమాదం

ఐదుగురు యువకుల మృతి

కారును ఢీకొట్టిన టిప్పర్‌

సిగ్నల్‌ జంపింగే ప్రమాదానికి కారణం

సాక్షి, హైదరాబాద్‌/గచ్చిబౌలి/గన్‌ఫౌండ్రీ: వీకెండ్‌ పార్టీలో ఎంజాయ్‌ చేద్దామనుకున్నారు. కారులో జాయ్‌ రైడ్‌ చేస్తున్నారు. కానీ, మృత్యువు టిప్పర్‌ రూపంలో కాటేసింది. అప్పటిదాకా ఆనం దంగా గడిపినవారు అంతలోనే అనంతలోకాలకు వెళ్లిపోయారు. సైబరాబాద్‌ కమిషనరేట్‌లోని ఐటీ కారిడార్‌లో ఉన్న ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఆదివారం తెల్లవారుజామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు యువకులు విగతజీవులయ్యారు. విప్రో జంక్షన్‌లో సిగ్నల్‌ జంప్‌ చేసిన వీరి స్విఫ్ట్‌ కారును వేగంగా వచ్చిన టిప్పర్‌ ఢీకొట్టింది. ఈ ధాటికి టిప్పర్‌ సైతం బోల్తా కొట్టింది. స్టాప్‌లైన్‌ వద్ద ఐదు సెకన్లు ఆగినా టిప్పర్‌ ముందుకు వెళ్లిపోయి ప్రాణాలు దక్కేవని, మృతులంతా 25 ఏళ్లలోపు యువకులేనని గచ్చిబౌలి ఇన్‌స్పెక్టర్‌ ఆర్‌.శ్రీనివాస్‌రావు తెలిపారు.


1.మనోహర్‌ 2.రోషన్‌ 3. భరద్వాజ్‌

ఎక్కడో పుట్టి.. ఎక్కడో పెరిగి..
ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లా దేవరపల్లి మండలం సంగాయ్‌గూడానికి చెందిన కాట్రగడ్డ సంతోష్‌(25) మాదాపూర్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌. నెల్లూరుకు చెందిన నాగిశెట్టి రోషన్‌(23), ఫస్ట్‌ లుక్‌ 3డీ యానిమేషన్‌లో పనిచేస్తున్న తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి గణేష్‌ కాలనీకి చెందిన చింతా మనోహర్‌ (23), విజయవాడలోని అజిత్‌సింగ్‌నగర్‌కు చెందిన పప్పు భరద్వాజ్‌ (20) మాదాపూర్‌ అయ్యప్ప సొసైటీలోని మారుతి పీజీ మెన్స్‌ హాస్టల్‌లో ఉంటున్నారు. నెల్లూరు జిల్లా వేదాయపాలెంకు చెందిన పవన్‌ కుమార్‌ (24) తన స్నేహితుడైన రోషన్‌ను కలిసేందుకు వచ్చాడు. పవన్‌ సోమవారం సాయంత్రం తన స్వస్థలానికి తిరిగి వెళ్లాల్సి ఉన్న నేపథ్యంలో శనివారం సాయంత్రం 6.30 గంటల ప్రాంతంలో ఈ ఐదుగురూ తమ స్విఫ్ట్‌ కారులో వీకెండ్‌ పార్టీకని బయలుదేరారు. రాత్రి 9 గంటల ప్రాంతంలో రోషన్‌ మినహా మిగిలిన నలుగురూ హాస్టల్‌కు తిరిగి వచ్చారు. మళ్లీ 9.26 గంటలకు ఆ నలుగురు బయటకు వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్‌ అయ్యాయి. (సెటిలయ్యాక వస్తానన్నాడు.. ఇంతలోనే విషాదం)
విప్రో సర్కిల్‌లో బోల్తా పడిన టిప్పర్‌.. నుజ్జునుజ్జయిన కారు 

కారు నడిపిందెవరంటే...
ప్రమాద సమయంలో కారును సంతోష్‌ నడుపుతున్నాడని పోలీసులు తెలిపారు. టిప్పర్‌ డ్రైవర్‌ దీపేందర్‌ సింగ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని శ్వాస పరీక్ష నిర్వహించగా మద్యం తాగిన ఆనవాళ్లు కనిపించలేదు. ఉస్మానియా ఆసుపత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం వారి సంబంధీకులకు మృతదేహాలను అప్పగించారు. అంతిమ సంస్కారాల నిమిత్తం స్వస్థలాలకు తరలించారు. 

జాయ్‌ రైడ్‌ కోసమేనా?
రాత్రి 9.26కు బయటకు వెళ్లిన ఐదుగురు స్నేహితులు తెల్లవారు జామున 2.48 గంటల వరకు ఎక్కడికి వెళ్లారనే ప్రశ్నకు పోలీసులకు కూడా సరైన సమాధానం దొరకట్లేదు. కారులో పగిలిపోయిన కొన్ని బాటిళ్ల ఆనవాళ్లు పోలీసులకు కనిపించాయి. ఈ నేపథ్యంలో వీళ్లు ఎక్కడైనా పార్టీ చేసుకొని జాయ్‌ రైడ్‌ కోసం అటు వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మృతులు మద్యం సేవించినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వస్తేనే అసలు విషయం తెలుస్తుందని పోలీసులు పేర్కొంటున్నారు. 

ప్రమాదం ఇలా..?
వీరు ప్రయాణిస్తున్న కారు ఆదివారం తెల్లవారుజామున 2.48 గంటల ప్రాంతంలో ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌లో ఉన్న విప్రో జంక్షన్‌ వద్దకు చేరుకుంది. ట్రిపుల్‌ ఐటీ వైపు నుంచి వచ్చిన ఈ కారు ఆ జంక్షన్‌ వద్ద కుడి వైపు తిరిగి గౌలిదొడ్డి వైపు వెళ్లాల్సి ఉంది. ఆ సమయంలో రెడ్‌ సిగ్నల్‌ పడటంతో ట్రిపుల్‌ ఐటీ వైపు నుంచే వచ్చిన మరో కారు ఆగి ఉంది. అయితే, రెడ్‌ సిగ్నల్‌ను బేఖాతరు చేసిన ఈ స్విఫ్ట్‌ కారు గౌలిదొడ్డి వైపు వెళ్లేందుకు ప్రయత్నించింది. అదే సమయంలో కోకాపేట వైపు నుంచి ట్రిపుల్‌ ఐటీ వైపు వెళ్ళేందుకు వేగంగా వస్తున్న టిప్పర్‌ (టీఎస్‌ 5 యుబి 2451) ఈ కారును ఢీ కొట్టింది. కారును రోడ్డు పక్కన తోసుకుంటూ వెళ్లిన టిప్పర్‌ కూడా బోల్తా కొట్టింది. ప్రమాదం ధాటికి కారు నుజ్జునుజ్జు కావడంతో ఐదుగురూ అందులో ఇరుక్కుపోయారు. సమాచారం అందుకుని అక్కడకు పోలీసులు వచ్చి.. కారులో ఇరుక్కున్నవారిని బయటకు తీశారు. అప్పటికే సంతోష్, రోషన్, పవన్, మనోహర్‌ విగతజీవులయ్యారు. తీవ్రరక్తస్రావం అవుతున్న భరద్వాజ్‌ను ఓ ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఉదయం తుదిశ్వాస విడిచాడు. కారులో లభించిన సెల్‌ఫోన్ల ఆధారంగా పోలీసులు మృతుల వివరాలను తెలుసుకున్నారు.

అంతుచిక్కని ఈ–చలానా!
ప్రమాదానికి ముందు దృశ్యం

ప్రమాదస్థలంలో నుజ్జునుజ్జై పడి ఉన్న వాహనంపై ఈ–చలాన్‌ జారీ అయి ఉంది. అదీ ఈ ప్రమాదం జరిగిన దాదాపు రెండున్నర గంటల తర్వాత కావడం గమనార్హం. తెల్లవారుజామున 2.48 గంటలకు ప్రమాదం జరిగితే, ఆదివారం ఉదయం 5.29 గంటలకు కొత్తగూడ జంక్షన్‌లో ఈ కారు క్యారేజ్‌ వేలో రాంగ్‌ పార్కింగ్‌ చేసినట్లు రూ.100 జరిమానాతో ఈ–చలానా జారీ అయింది. ఈ చలానా ప్రకారం.. ప్రమాదం జరిగిన 2 గంటల 41 నిమిషాల తర్వాత... ఘటనాస్థలికి సుమారు ఆరు కిలోమీటర్ల వెనుక సదరు కారు రాంగ్‌ పార్కింగ్‌లో ఉందన్నమాట. ఈ చిక్కు ప్రశ్నకు పోలీసులే సమాధానం చెప్పాలి. ప్రతి ఈ–చలానాతోపాటు ఉల్లంఘనకు సంబంధించిన ఫొటోనూ సదరు వెబ్‌సైట్‌ పొందుపరుస్తుంది. అయితే ఈ ఈ–చలానాకు సంబంధిత ఫొటోను మాత్రం జత చేయలేదు.  

మరిన్ని వార్తలు