నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం 

13 Dec, 2020 04:18 IST|Sakshi
నదిలో పడిపోయిన పాప కోసం రోదిస్తున్న తల్లిదండ్రులు

ఇద్దరు యువకుల దుర్మరణం, మరో యువకుడికి తీవ్ర గాయాలు 

నదిలో తొమ్మిదేళ్ల బాలిక గల్లంతు  

నాయుడుపేట టౌన్‌: నెల్లూరు జిల్లా నాయుడుపేట సమీపంలోని స్వర్ణముఖి నదిపై ఉన్న కాజ్‌వే వద్ద శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో విశాఖపట్నానికి చెందిన త్రినాథ్‌ (22), సాయి (25) అనే ఇద్దరు యువకులు దుర్మరణం చెందారు. ప్రవల్లిక అనే తొమ్మిదేళ్ల బాలిక స్వర్ణముఖి నదిలో గల్లంతైంది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి..  నాయుడుపేట సమీపంలోని మేనకూరు ప్రైవేటు పరిశ్రమలో పనిముగించుకుని త్రినాథ్, సాయి, దొరవారిసత్రం మండలం మోదుగులపాళెంకు చెందిన నాగూర్‌ ఒకే బైక్‌పై నాయుడుపేటకు వస్తున్నారు. వీరి వెనుకే బైక్‌పై తుమ్మూరులో నివాసముంటున్న మురళి, ఆయన భార్య సుజాత, కుమార్తె ప్రవల్లిక వెళ్తున్నారు. ఈ క్రమంలో ఓ కారు కాజ్‌వేపై వెళ్తుండగా ముగ్గురు యువకులు తమ బైక్‌తో దాన్ని ఢీకొట్టారు. దీంతో వెనుకనే మరో బైక్‌పై వస్తున్న మురళి దంపతులతోపాటు వారి కుమార్తె ప్రవల్లిక స్వర్ణముఖి నదిలో పడిపోయారు. గాఢాంధకారంలో గాయాలతో ఉన్న మురళి, సుజాతలు వెంటనే కాజ్‌వే పైకి వచ్చి తమ బిడ్డ నదిలో కొట్టుకుపోతోందని పెద్ద ఎత్తున కేకలు వేశారు. ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు కావడంతో 108 అంబులెన్స్‌లో స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు చికిత్స ప్రారంభించేటప్పటికే త్రినాథ్, సాయి మృతి చెందారు. నాగూర్‌ గాయాలతో బయటపడ్డాడు.  

బాలిక కోసం గాలింపు:  ప్రమాద విషయం తెలుసుకున్న వెంటనే సీఐ జి.వేణుగోపాల్‌రెడ్డి, ఎస్సైలు డి.వెంకటేశ్వరరావు, బాలకృష్ణయ్యలు పోలీసు సిబ్బందితో హుటాహుటిన కాజ్‌వే వద్దకు చేరుకున్నారు. అప్పటికే స్థానికులు స్వర్ణముఖి నదిలో దిగి గల్లంతైన ప్రవల్లిక కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అగ్నిమాపక శాఖ అధికారులు కూడా హుటాహుటిన నది వద్దకు చేరుకొని ఫ్లడ్‌లైట్ల వెలుతురులో బాలిక కోసం గాలిస్తున్నారు. 

మరిన్ని వార్తలు