వెంట్రుకలపై క్రేజ్‌: చైనాకు జుట్టు అక్రమ రవాణా 

12 Apr, 2021 07:31 IST|Sakshi

ప్రపంచ వ్యాప్తంగా దక్షిణాది వెంట్రుకలపై క్రేజ్‌ 

హైదరాబాద్‌ కేంద్రంగా అక్రమ రవాణా 

మయన్మార్‌ మీదుగా చైనాకు

దృష్టి సారించిన డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ 

కలర్‌ ప్రిడెక్షన్‌ కేసు దర్యాప్తులోనూ ఈ కోణం వెలుగులోకి

సాక్షి, హైదరాబాద్‌: నలుపు మినహా ఇతర రకాలైన రంగుల వినియోగం తక్కువ కావడంతో పాటు సిల్కీగా ఉండే  దక్షిణాది వారి తల వెంట్రుకలతో తయారయ్యే విగ్గులకు ప్రపంచ వ్యాప్తంగా భారీ డిమాండ్‌ ఉంది. దీంతో హైదరాబాద్‌ కేంద్రంగా వ్యవహారాలు సాగిస్తున్న కొన్ని ముఠాలు తల వెంట్రుకల్ని మయన్మార్‌ మీదుగా చైనాకు అక్రమ రవాణా చేస్తున్నాయి. దీనిపై సమాచారం అందుకున్న డైరెక్టరేట్‌ ఆఫ్‌ రెవెన్యూ ఇంటెలిజెన్స్‌ (డీఆర్‌ఐ) అధికారులు అస్సోం రైఫిల్స్‌ సహకారంతో నిఘా ముమ్మరం చేశారు.  

ఆ మినహాయింపును అనువుగా మార్చుకుని... 
లూజ్‌ హెయిర్‌ సేకరణకు జీఎస్టీ నుంచి మినహాయింపు ఉంది. దీనిని తమకు అనువుగా మార్చుకుంటున్న స్మగ్లర్లు ఏరియాల వారీగా ఏజెంట్లను ఏర్పాటు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌ కేంద్రంగా ఈ దందా నడుపుతున్న ఎనిమిది మంది ఏజెంట్లు దక్షిణాదిలోని అనేక ప్రాంతాల్లో ఏజెంట్లను ఏర్పాటు చేసుకున్నారు. వీరు ప్రధానంగా ఆయా ప్రాంతాల్లోని సెలూన్ల నుంచి వెంట్రుకలు సేకరిస్తారు. వీటిని పాత వస్త్రాల పేరుతో ప్యాక్‌ చేసి బస్సుల్లో హైదరాబాద్‌కు చేరవేస్తున్నారు. ఎల్బీనగర్‌ ప్రాంతానికి చేరుకుంటున్న ఈ పార్శిల్స్‌ను ఏజెంట్లు తీసుకుని తమ స్థావరాలకు తరలిస్తున్నారు.  ఆడవారి వెంట్రుకలకు డిమాండ్‌ ఎక్కువగా ఉండటంతో ఈ మాఫియా పలు దేవాలయాల్లోని క్షురకులతో ఒప్పందాలు చేసుకుని అక్కడి నుంచి మహిళల వెంట్రుకల తస్కరణ, అక్రమ రవాణాను ప్రోత్సహిస్తోంది. 

ఎయిర్‌ కార్గో ద్వారా మయన్మార్‌కు... 
ఈ వెంట్రుకలు చేరాల్సింది చైనాకే అయినప్పటికీ నేరుగా వెళ్లడం లేదు. విదేశాలకు ఎయిర్‌ కార్గో ద్వారా పంపిస్తే డీఆర్‌ఐ, కస్టమ్స్‌ సహా వివిధ ఏజెన్సీల కన్ను పడే అవకాశం ఉండటంతో వీటిని వేర్వేరు పేర్లతో రైళ్లు, బస్సులు, ట్రాన్స్‌పోర్ట్‌ ఏజెన్సీల ద్వారా కోల్‌కతాకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో తమ వాహనాల్లోనే మయన్మార్‌కు తీసుకెళ్తున్నారు. .  

డీఆర్‌ఐకి లేఖ.. 
అధికారికంగా తల వెంట్రుకలు ఖరీదు చేయడానికి, వీటిని ప్రాసెస్‌ చేసి విదేశాలకు పంపడానికి ‘హ్యూమన్‌ హెయిర్‌ అండ్‌ హెయిర్‌ ప్రొడక్టŠస్‌ మ్యాన్‌ఫ్యాక్చరర్స్‌ అండ్‌ ఎక్స్‌పోర్టర్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా’ పేరుతో ఓ సంస్థ పని చేస్తోంది. వీరు వేలం పాటల ద్వారా వివిధ ప్రార్థన స్థలాల నుంచి తల వెంట్రుకల్ని ఖరీదు చేసి ప్రాసెసింగ్‌ అనంతరం నేరుగా విదేశాలకు ఎగుమతి చేస్తుంటారు. వీరు చైనాకు తల వెంట్రుకల్ని పంపినప్పుడు 26 శాతం ఇంపోర్ట్‌ డ్యూటీ చెల్లించాల్సి వస్తోంది. స్మగ్లర్ల ద్వారా అడ్డదారిలో చేరుతున్న తల వెంట్రుకలకు ఇలాంటి పన్నులు లేకపోవడంతో తక్కువ ధరకు అమ్మేస్తున్నారు. ఫలితంగా వీరి వ్యాపారం తీవ్రంగా దెబ్బతినడంతో పాటు దేశానికి పన్ను రూపంలో రావాల్సిన ఆదాయానికి గండి పడుతోంది. ఇదే అంశాన్ని వివరిస్తూ అసోసియేషన్‌ కొన్నాళ్ల క్రితం డీఆర్‌ఐకి లేఖ రాసింది. 

చెల్లింపులన్నీ అక్రమ మార్గంలోనే... 
చైనాలోని తల వెంట్రుకల్ని ఖరీదు చేసే సంస్థలు నగరంలో ఉన్న తమ ఏజెంట్లకు డబ్బును అక్రమ మార్గంలోనే పంపిస్తున్నాయి. ప్రధానంగా వీరు హవాలా, బిట్‌కాయిన్స్‌ మార్గాలను అశ్రయిస్తున్నారు. గత ఏడాది వెలుగులోకి వచ్చిన కలర్‌ ప్రిడెక్షన్‌ కేసు దర్యాప్తులో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ ఆన్‌లైన్‌ గేమింగ్‌ను నిర్వహించిన చైనా సంస్థలు దీని ద్వారా యువత నుంచి దోచుకున్న డబ్బును డాకీ పే అనే పేమెంట్‌ గేట్‌ వేకు పంపారు. అక్కడ నుంచి ఈ డబ్బులో రూ.20 కోట్లు ఎల్బీనగర్‌ ప్రాంతానికి చెందిన ముగ్గురు జుట్టు వ్యాపారులకు చేరింది.

ఈ విషయాన్ని గుర్తించిన దర్యాప్తు అధికారులు వారిని ప్రశ్నించగా... తాము జుట్టును చైనాకు పంపిస్తామని, అందుకు సంబంధించిన నగదు డాకీ పే ద్వారా తమకు చేరిందని చెప్పుకొచ్చారు. తాజా పరిణామాల నేపథ్యంలో డీఆర్‌ఐ, కస్టమ్స్‌తో పాటు సహరిద్దుల్లో పహారా కాసే బలగాలు తల వెంట్రుకల స్మగ్లింగ్‌పై డేగకన్ను వేశాయి. ఫలితంగా మిజోరాం–మయన్మార్‌ బోర్డర్‌లో గతేడాది 190 మంది స్మగ్లర్లు చిక్కగా... ఈ ఏడాది ఇప్పటికే 53 మంది పట్టుబడ్డారు. వీరిలో అత్యధికులకు హైదరాబాద్‌లోని డీలర్లతో సంబంధాలు ఉన్నట్లు డీఆర్‌ఐ అధికారులు చెబుతున్నారు.
చదవండి: బావతో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మరిన్ని వార్తలు