Vijayawada: ఈ భార్యాభర్తలు మామూలోళ్లు కాదు.. సినిమా స్టైల్‌లో..

2 Feb, 2023 18:14 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

అజిత్‌సింగ్‌నగర్‌(విజయవాడసెంట్రల్‌): ఇంట్లో పని కోసం మొదటిరోజు వచ్చిన భార్యాభర్తలు, మరుసటి రోజు అదే ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ఈ ఘటన సింగ్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో బుధవారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. రామకృష్ణాపురం ప్రాంతంలో చెందిన నెట్ల లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి  దంపతులు నివసిస్తున్నారు. వారు ఇద్దరూ వృద్ధులు కావడంతో తమ ఇంటిలో సామాన్లు సర్దడం కోసం పనివారు కావాలని తెలిసిన మహిళను అడిగారు.

ఆమె ముత్యాలంపాడు, గవర్నమెంట్‌ ప్రెస్‌ సమీపంలో నివసించే అక్కరబోతు అంజిబాబు, లీలాదుర్గ దంపతులను పనికి మాట్లాడింది. లక్ష్మీప్రసాద్‌ ఇంటికి మంగళవారం పనికి వచ్చిన అంజిబాబు, లీలాదుర్గ రాత్రి 11 గంటల వరకూ సామాన్లన్నీ సర్ది, కూలి తీసుకొని వెళ్లిపో యారు. బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో వారిరువురు మళ్లీ లక్ష్మీప్రసాద్‌ ఇంటికి వచ్చి తలుపులు కొట్టారు.

అతని భార్య జయలక్ష్మి ఇంటి తలుపు తీయగా వారు వెంటనే ఆమెను లోపలకు నెట్టేసి, నోరు నొక్కేసి ఐదు కాసుల బంగారు నానుతాడు, నాలుగు కాసుల బంగారు లాకెట్, చెవిదిద్దులు, రెండు పేటల నల్లపూసలగొలుసు లాక్కొని పారిపోయారు. దీంతో అంజిబాబు, లీలాదుర్గను పనికి మాట్లాడిన మహిళ దగ్గరకు లక్ష్మీప్రసాద్, జయలక్ష్మి వెళ్లి విషయం చెప్పారు. అనంతరం వారు ముగ్గురూ కలిసి అంజిబాబు, లీలాదుర్గ ఇంటికి వెళ్లగా తలుపులకు తాళాలు వేసి కనిపించాయి.
చదవండి: మహిళపై వీఆర్వో వేధింపులు.. వాట్సాప్‌లో మెసేజ్‌లు చేస్తూ.. 

అనంతరం బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సింగ్‌నగర్‌ సీఐ ఎస్‌.వి.వి.ఎస్‌.లక్ష్మీనారాయణ, క్రైం ఎస్‌ఐ సత్యనారాయణ, హెడ్‌కానిస్టేబుల్‌ ఖాన్, కానిస్టేబుల్‌ మహేష్, ఉమెన్‌ కానిస్టేబుల్‌ జానకి, హోమ్‌గార్డ్‌ నటరాజ్‌ బృందాలుగా ఏర్పడి నిందితుల కోసం గాలింపు చేపట్టారు. గవర్నర్‌పేట బ్రిడ్జి డౌన్‌లో అనుమానా స్పదంగా తిరుగుతున్న అంజిబాబు, లీలాదుర్గను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. చోరీకి గురైన మొత్తం సొత్తును వారి వద్ద స్వా«దీనం చేసుకుని, ఇద్దరినీ అరెస్ట్‌ చేశారు.  

మరిన్ని వార్తలు