ఇటు భర్త.. అటు భార్య మిస్సింగ్‌.. తలలు పట్టుకున్న పోలీసులు.. 

27 Apr, 2021 11:02 IST|Sakshi

సాక్షి, బంజారాహిల్స్‌: వివాహిత  మోజులో పడి భార్యాపిల్లలను వదిలేసి ఆమెతో ఉడాయించిన ఘటన జూబ్లీహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణానగర్‌లో నివాసం ఉంటున్న యువకుడు(31) ఆర్‌సీపురంలోని ఓ బైక్‌ షోరూమ్‌లో బ్రాంచి మేనేజర్‌గా పనిచేస్తున్నాడు. అతడికి ఎనిమిదేళ్ల క్రితం ప్రేమ పెళ్లయింది. భార్య(30), కూతురు(6), కొడుకు(4)తో కలిసి ఆనందంగా జీవిస్తున్నారు. కాగా అతడితో పాటు పనిచేస్తున్న వివాహిత(21)తో నెలరోజుల క్రితం పరిచయం అవడంతో పాటు చాటింగ్‌లు చేసుకుంటున్నారు.

ఈక్రమంలో మూడురోజుల క్రితం అతడు చెప్పాపెట్టకుండా ఇంట్లోంచి వెళ్లిపోయాడు. భర్త ఆచూకీ కనిపించక అన్ని ప్రాంతాల్లో గాలించినా ప్రయోజనం లేకపోవడంతో సోమవారం భార్య జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఆరా తీయగా కాల్‌రికార్డ్స్, చాటింగ్స్‌ ఆధారంగా వివాహితతో కలిసి వెళ్లినట్లు తేలింది. ఆమె భర్త కూడా చందానగర్‌ పీఎస్‌లో భార్య కనిపించడం లేదంటూ ఫిర్యాదు చేసినట్లు తేలింది. దీంతో ఏం చేయాలో అర్థం కాక పోలీసులు తలపట్టుకుంటున్నారు. ఉడాయించిన ఇద్దరూ మేజర్లే కావడంతో సమస్య ఎక్కడకు దారితీస్తుందో అని వారు వేచిచూస్తున్నారు. అమ్మా..! డాడీ ఎక్కడంటూ రాత్రి నుంచి కుమార్తె ఏడుస్తోందంటూ బాధిత యువతి విలపిస్తుండటం పోలీసులను సైతం కంటతడి పెట్టించింది.   

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు