కూతురు లేని లోకం వద్దనుకుని..

6 Aug, 2021 01:44 IST|Sakshi
కుమార్తెతో లక్ష్మణచారి, హేమలత దంపతులు (ఫైల్‌)

గోదావరిలో దూకి భార్యాభర్తల బలవన్మరణం

మృత్యువులోనూ వీడిపోకుండా చేతులకు రుమాలుతో ముడి  

బూర్గంపాడు / పాల్వంచ: కూతురు మరణాన్ని ఆ దంపతులు జీర్ణించుకోలేకపోయారు. బిడ్డ లేని జీవితం తమకొద్దు అనుకుని గోదావరిలో దూకి బలవన్మరణానికి పాల్పడ్డారు. హైదరాబాద్‌ ఈసీఐఎల్‌కు చెందిన పమ్మి లక్ష్మణచారి (55), హేమలత (48) దంపతులు అక్కడే టైలరింగ్‌ చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి ఒక కుమార్తె ఉండగా, ఇటీవల ఆమె గుండె సంబంధిత వ్యాధితో మృతి చెందింది. అపురూపంగా పెంచుకుంటున్న కూతురు మరణాన్ని జీర్ణించుకోలేని ఆ దంపతులు మానసికంగా కృంగిపోయారు. దీంతో ఆందోళనలో ఉన్న వీరిని పాల్వంచకు చెందిన హేమలత సోదరుడు వేమనకుమార్‌ పది రోజుల క్రితం తమ ఇంటికి తీసుకువచ్చారు.

ఈ క్రమంలో బుధవారం ఆయన విధుల నిమిత్తం మణుగూరు వెళ్లారు. ఆయన భార్య అంతకు ముందురోజే హైదరాబాద్‌ వెళ్లారు. వేమనకుమార్‌ సాయంత్రం విధులు ముగించుకుని వచ్చేసరికి ఇంట్లో సోదరి, బావ కనిపించలేదు. లక్ష్మణచారి ఫోన్‌ ఎత్తకపోవడంతో ఇంట్లోని వారి వస్తువులను పరిశీలించగా ఫోన్, సూసైడ్‌ నోట్‌ కనిపించాయి. వెంటనే పాల్వంచ పోలీస్‌స్టేషన్‌లో దంపతుల అదృశ్యంపై ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, గురువారం రాత్రి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు వద్ద గోదావరిలో దస్తీతో చేతులు ముడివేసిఉన్న రెండు మృతదేహాలు జాలర్లకు కనిపించాయి. వాటిని లక్ష్మణాచారి, హేమలత మృతదేహాలుగా గుర్తించి బూర్గంపాడు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించినట్లు ఎస్‌ఐ జితేందర్‌ తెలిపారు.

మరిన్ని వార్తలు