తాగుబోతు భర్తకు ఎదురుపడ్డ భార్య, మత్తులో ప్రాణాలు తీసి..

4 Aug, 2021 11:16 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ముమ్మిడివరం: భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో వ్యక్తి. ముమ్మిడివరం నగర పంచాయతీ శివారు నక్కావారిపేటలో సోమవారం రాత్రి ఈ హత్యోదంతం జరిగింది. నక్కవారిపేటకు చెందిన కాశి రవీంద్రకు 14 ఏళ్ల కిందట ఉప్పలగుప్తం మండలం గోపవరానికి చెందిన అంబటి దుర్గా ఈశ్వరి(32)తో పెళ్లయింది. వీరికి 12 ఏళ్ల భరత్, తొమ్మిదేళ్ల శరత్‌ అనే ఇద్దరు కుమారులున్నారు. నగర పంచాయతీలో రవీంద్ర కాంట్రాక్టు ప్రాతిపదికపై చెత్త తరలింపు ట్రాక్టర్‌ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు.

ఇటీవల మరో మహిళతో వివాహేతర సంబంధం ఏర్పరచుకున్నాడు. మద్యానికి బానిసయ్యాడు. ఇంటికి తరచూ ఆలస్యంగా వచ్చేవాడు. అతడి తీరుతో విసిగిపోతున్న దుర్గా ఈశ్వరి పలుమార్లు నిలదీసింది. సోమవారం రాత్రి 10 గంటలు దాటినా ఇంటికి రాకపోవడంతో భర్తకు ఫోన్‌ చేసింది. ఆ సమయంలో రవీంద్ర యానాంలో మద్యం తాగుతున్నట్టు తెలుసుకుని గట్టిగా నిలదీసింది. తర్వాత కూడా ఇంటికి రాకపోవడంతో అతడి కోసం బయలుదేరింది.

200 మీటర్ల దూరం వెళ్లేసరికి భర్త ఎదురు పడ్డాడు. వారి మధ్య మరోసారి గొడవ జరిగింది. మద్యం మత్తులో ఉన్న రవీంద్ర భార్య దుర్గా ఈశ్వరిపై దాడిచేశాడు. అతడి పిడిగుద్దులకు ఆమె కింద పడింది. వెంటనే ఆమె తలను రోడ్డుకు వేసి కొట్టడంతో అక్కడికక్కడే చనిపోయింది. మృతదేహన్ని రోడ్డు పక్కన కాలువలో పడేసి రవీంద్ర ఇంటికి వెళ్లి నిద్రపోయాడు. ఉదయాన్నే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి తానే భార్యను హత్య చేశానని చెప్పి లొంగిపోయాడు. అమలాపురం డీఎస్సీ ఎం.మాధవరెడ్డి, సీఐ ఎం.జానకీరామ్, ఎస్సై కె.సురేష్‌బాబు సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీయించారు. శవ పంచనామా నిర్వహించారు.

Read latest Crime News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు