అనుమానంతో భార్యను హతమార్చిన భర్త

1 Jul, 2021 09:49 IST|Sakshi

సాక్షి, నేరడిగొండ(బోథ్‌): అనుమానంతో భార్యను హతమార్చిన సంఘటన మండలంలోని దేవులతాండ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. ఇన్‌చార్జీ సీఐ ప్రేమ్‌కుమార్, ఎస్సై భరత్‌సుమన్‌ వివరాల ప్రకారం... బజార్‌హత్నూర్‌ మండలం చందునాయక్‌తండాకు చెందిన జమునబాయి (26) 2014లో మహారాష్ట్రలోని కిన్వట్‌ తాలుక బోదిడి గ్రామానికి చెందిన రాజుకు ఇచ్చి వివాహం చేశారు. పెళ్లి తర్వాత కూలీ పనికోసం ఔరంగాబాద్‌ వెళ్లి పనిచేశారు. వీరికి ఇద్దరు కూతుర్లు అర్చన, దోను, ఏడాదిన్నర కుమారుడు గోలు జన్మించారు. రెండు సంవత్సరాలుగా భార్యను అనుమానిస్తూ వేధింపులు మొదలుపెట్టాడు. పలుమార్లు పెద్దల సమక్షంలో పంచాయితీ నిర్వహించి సర్ది చెప్పారు. అయినా రాజులో మార్పు రాలేదు.

నాలుగు నెలల క్రితం మండలంలోని దేవులతండాకు బతుకుదెరువు కోసం వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం రాత్రి భార్యతో గొడవకు దిగాడు. బుధవారం ఉదయం 4గంటల ప్రాంతంలో ఇంటి ఆరుబయట నిద్రిస్తున్న జమునబాయిని గడ్డపారతో తలపై కొట్టి హతమార్చాడు. విషయాన్ని తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని క్లూజ్‌టీమ్‌ ద్వారా వివరాలను సేకరించి మృతదేహాన్ని బోథ్‌ సివిల్‌ ఆస్పత్రికి మృతదేహాన్ని తరలించారు. తల్లి మృతితో ముగ్గురు చిన్నారులు అనాధలుగా మారారు.  

చదవండి: చెన్నై ఎయిర్‌పోర్టులో బంగారం స్వాధీనం 

మరిన్ని వార్తలు