ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా

19 Jun, 2022 08:06 IST|Sakshi
భర్త కుళ్లాయప్పతో అపర్ణ (ఫైల్‌)  

కళ్యాణదుర్గం (అనంతపురం): అందంగా లేదని కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటన కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో నివాసముంటున్న కుళ్లాయప్ప బేల్దారి పని చేసుకునేవాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి చెందిన అపర్ణ (27)ను ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు.

పెళ్లికి ముందు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలంగా కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవపడేవాడు. అందంగా లేవని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపి విడాకులు తీసుకునేందుకు అపర్ణ సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కుళ్లాయప్ప మద్యం మత్తులో ఇంటికి చేరుకుని రోజువారీగానే భార్యతో గొడవ పెట్టుకుని కత్తితో అపర్ణ పొట్టలో బలంగా పొడిచాడు.

రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అపర్ణను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. హతురాలి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.   

చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) 

మరిన్ని వార్తలు